వేసవి సమీస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి సరఫరా చేసే మంచి నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతున్నది. జలమండలి అధికారులు ముందస్తుగానే ట్యాంకర్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ట్యాంకర్ యజమానులు తమ బ్యాంకు ఖాతాలను ఇవ్వాలని జలమండలి ఈడీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 31లోపు ట్యాంకర్ యజమానులు బ్యాంకు ఖాతాలను జలమండలి కార్యాలయాల్లో సమర్పించకుంటే సంబంధిత ట్యాంకర్లకు నీటి సరఫరా చేసే అవకాశం కల్పించబోమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నుంచి బ్యాంకు ఖాతాలు ఇచ్చిన ట్యాంకర్లకే నీటి సరఫరా అనుమతులు ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఖాతాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే అయోమయంలో ట్యాంకర్ల యజమానులు ఉన్నారు. ఇన్నేండ్ల నుంచి లేని విధంగా కొత్తగా ఈ పద్ధతి తీసుకురావడం వెనుక ఆంతర్యమేంటనే సందిగ్ధంలో ఉన్నారు. ఈనెల 31 లోపే ఖాతా నంబర్లు ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ట్యాంకర్ల యజమానులకు ఖాతా వివరాలు కాకుండా పాత విధానాన్ని కొనసాగించకుంటే ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో ఈడీని కలిసి విన్నవించాలని ప్రయత్నిస్తున్నారు. ఈడీ తమ డిమండ్‌కు అనుకూలంగా స్పందించకుంటే ట్యాంకర్ల సరఫరా బంద్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై మంగళవారం ఎండీ అశోక్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎండాకాలంలో ట్యాంకర్ల కొరత ఏర్పడకుంటా ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచాలని, అందుకు అనుగుణంగా అదనపు ట్యాంకర్లను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్లు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. మరోవైపు ఈడీ ట్యాంకర్ యజమానులు బ్యాంక్ ఖాతాలు ఇవ్వకుంటే సరఫరాకు అనుమతించబోమని సర్క్యులర్ జారీ చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో మాత్రం అవసరమైతే అదనపు ట్యాంకర్లను సమకూర్చుకోవాలని ఎండీ చెప్పడంపై అయోమయం నెలకొన్నది. ఈనేపథ్యంలో ఈడీని మరోసారి కలిసి తమ వినతిని చెప్తామని ఆయన సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ట్యాంకర్స్ అసోసియేషన్ నేతలు చెప్తున్నారు. ఈడీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందంటున్నారు. ఏదీ ఏమైనా అధికారులు సరైన ప్రణాళిక ప్రకారం ఎండాకాలంలో మంచినీటిని సరఫరా చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.