Dasoju Sravan | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచి వందలాది మంది పోలీసులు మోహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. అర్ధరాత్రి నుంచే వేలాది మందిని బైండోవర్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, తలసాని, ఇతర బీఆర్ఎస్ నేతలను నిర్బంధించారని చెప్పారు.
సికింద్రాబాద్ నీ అయ్య జాగీరా.. అని సీఎం రేవంత్ రెడ్డిని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నాశనం చేస్తావా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక నియంత అని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌ది 200 ఏండ్ల చరిత్ర అని తెలిపారు. శాంతియుత ర్యాలీ చేయొద్దని గాంధీ చెప్పాడా? రాహుల్ గాంధీ చెప్పాడా అని మండిపడ్డారు. ఇప్పుడు ర్యాలీలపై జులుం చూపిస్తున్న నువ్వు ఎన్నిసార్లు ర్యాలీలు చేయలేదని ప్రశ్నించారు. సీఎం ఆఫీస్, ఈడీ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయలేదా అని నిలదీశారు.
పోలీసులను ఉసిగొలిపి అడ్డమైన కేసులు పెడతారా అని కాంగ్రెస్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అక్రమంగా జర్నలిస్టులను అరెస్టు చేయించారని తెలిపారు. నీకన్నా గొప్ప నియంతలు మట్టికొట్టుకుపోయారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. నీకు టైమ్ దగ్గర పడిందని హెచ్చరించారు. ఆనాడు ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి హైదరాబాద్ పేరు మార్చిండని గుర్తుచేశారు. మళ్లీ ఇవాళ రేవంత్ అనే నియంత సికింద్రాబాద్‌ను నామరూపాల్లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. నిరసన తెలపడం ప్రజల ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.