Dalit Bandhu | మేడ్చల్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం ఉన్నట్టా..? లేనట్టా? అన్న ఆందోళనలో దళిత బంధు లబ్దిదారులు ఉన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందిన దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రెండో విడత దళితబంధు పథకానికి నియోజకవర్గానికి 11 వందల మంది చొప్పున 5500 మందికి దళితబంధు పథకానికి ఎంపిక చేసిన విషయం విదితమే. అయితే, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దళితబంధు పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎంపికైన లబ్దిలదారులు దళితబంధు పథకం అమలు చేస్తారా? లేదా? అన్నది స్పష్టత రావడం లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడతలో దళితబంధు పథకంలో జిల్లాలోని 500ల మంది లబ్దిదారులను ఎంపిక చేసి రూ. 50 కోట్లను నిధులను ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించిన నేపథ్యంలో వివిధ వ్యాపారాలలో నిలదోక్కుకుని ఆర్థికంగా నిలదోక్కుకుంటున్నారు. రెండవ విడతలో ఎంపికైన లబ్ధిదారులు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
దళితబంధు పథకంపై స్టెటస్ కో…
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టెటస్కో విధించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రెండవ విడత దళతబంధు పథకంలో నియోజకవర్గానికి 11 వందల మంది చోప్పున ఎంపిక చేసిన స్టెటస్కో విధించడం మూలంగా దళితబంధు పథకం నిలిచిపోయింది. అయితే ఇటివల దళిత సంఘాలు దళితుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దళితబంధు పథకాన్ని ఎప్పటిలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
దళితబంధు పథకానికి ఎంపికైనా లబ్దిదారులు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దళితబంధు పథకంపై సరైన సమాదానం అధికారులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి దళితబంధు పథకాన్ని లబ్దిదారులకు అందించి మూడో విడత దళితబంధు పథకం ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని దళిత సంఘాల సభ్యులు కోరుతున్నారు.