యాచారం, ఫిబ్రవరి19: యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో పాడి రైతులకు పాల బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మాల్ మదర్ డైరీ సంస్థ సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన పాడి రైతులు పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. మదర్ డైరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతులకు రూ. 4 లక్షలకు పైగా బిల్లులు రావాలని, సంస్థ బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా పాలను కొనుగోలు చేసి వాళ్లకి డబ్బులు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ రైతులకు మాత్రం సకాలంలో డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని మదర్ డైరీ యాజమాన్యంపై రైతులు మండిపడ్డారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే రైతులకు జీవనోపాధి ఎలా ఉంటుందని వారు ప్రశ్నించారు. బిల్లులు రాకపోవడంతో పాడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వారు పేర్కొన్నారు. మదర్ డైరీని విలీనం చేసి, మదర్ డైరీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పాడి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. మదర్ డైరీ యాజమాన్యం దిగొచ్చి పాడి రైతులకు బకాయి బిల్లులు చెల్లించే వరకు అందోళన చేస్తామని వారు హెచ్చరించారు.