Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సైబర్ మోసగాళ్ల కమీషన్‌కు ఆశపడి తన సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను అద్దెకిచ్చారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో కొట్టేసిన రూ.1.90 కోట్లలో రూ.25లక్షలు ఆమెకు కమీషన్‌గా ఇచ్చారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఖాతాల లావాదేవీల ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అయితే ఈ లావాదేవీల వ్యవహారంలో అసలు సూత్రధారులెవరనేది ఆమెకు కూడా తెలియదు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలకు మోసపోయి తాను కమీషన్లకు ఆశపడి ఇలా చేసినట్లుగా ఆమె తరపు న్యాయవాదులు ఎంతగా వాదించినా నేరంలో భాగస్వామి అయినందున పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ నేరస్తుల కట్టడిలో నగర పోలీసులు దూకుడు పెంచినప్పటికీ సూత్రధారులను పట్టుకోవడంలో పోలీసులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీ సహకారంతో నేరంలో భాగస్వాములైన వారి ఆచూకీ గుర్తిస్తున్నారు. 2024లో 2868 సైబర్ క్రైమ్ కేసులు నమోదైతే.. అందులో 418 మంది నేరస్తులను వెంటనే అరెస్టు చేయగా..ఈ ఏడాది 4 నెలల వ్యవధిలో 285 మంది అరెస్టయ్యారు. నకిలీ వివరాలు, సిమ్‌కార్డులు మార్చుతూ పోలీసులను ఏమార్చుతున్నామని భావించే మాయగాళ్లకు గుబులు పుట్టిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అరస్టైన వారిలో సూత్రధారులకంటే పాత్రధారులే ఎక్కువ అని తెలుస్తున్నది.
సైబర్ క్రైమ్ ఎవరైతే కమీషన్లకు ఆశపడి తమ ఖాతాలు అందిస్తున్నారో, బ్యాంకుల ద్వారా ఎవరైతే సహకారం అందిస్తున్నారో వారు అరెస్టవుతున్నారు తప్ప అసలు సూత్రధారులు ఎక్కువగా వేరే రాష్ర్టాలతోపాటు చైనా, దుబాయ్ వంటి ఇతర దేశాల్లో ఉంటున్నారని, వారిని పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని పోలీసులు చెప్పారు. అయితే నేరాల కట్టడికి మధ్యవర్తులను పట్టుకోవడం ద్వారా ఎవరిని ఖాతాలు ఇవ్వకుండా, అసలు నేరాలకు సహకరించకుండా ఉంటారని వారు పేర్కొన్నారు. కానీ పోలీసుల పట్టుకున్న వారిలో యువకులు, మహిళలు, బ్యాంక్ ఉద్యోగులు, ఇతర వృత్తుల్లో అధిక ఆదాయం కోసం ఆశ పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని, వారిలో చాలా మందికి ఈ నేరాల్లో పాలుపంచుకుంటున్నారని వారికే తెలియదని పోలీసులే చెబుతున్నారు.
నగర సైబర్‌క్రైమ్ పోలీసులు కేసుల దర్యాప్తు, నిందితుల కోసం వివిధ రాష్ర్టాలకు వెళ్తుంటారు. అక్కడ ఎదురయ్యేసవాళ్లను పసిగడుతూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్నిచోట్ల సవాళ్లను ఎదుర్కోక తప్పడం లేదు. రాజస్తాన్, గుజరాత్, యూపీ వంటి చోట్ల పదుల సంఖ్యలో గ్రామాలు సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారాయి. బయటి నుంచి ఎవరొచ్చినా వారికి సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకున్న సైబర్ నేరగాళ్లు తమ దగ్గరకు ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
గుజరాత్‌కు చెందిన ఓ నేరగాడిని పట్టుకునేందుకు సైబర్‌క్రైమ్ పోలీసులు అక్కడికి వెళ్లగా.. ఆచూకీ చెప్పేందుకు పోలీసులు సంప్రదించిన స్థానిక కానిస్టేబుల్ ఒకరు నిందితుడి నుంచి కమీషన్ తీసుకుని తమ సమాచారం చేరవేస్తూ నిందితుడు తప్పించుకునేందుకు సహకరించారు. దుబాయ్ కేంద్రంగా క్రిప్టో మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు ఖాతాదారుడి ఆధారంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రైవేటు బ్యాంకుల సిబ్బంది లింకులు బయటపడటంతో నలుగురిని అరెస్ట్ చేశారు.