Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): జుడియో ఫ్రాంచైస్ కోసం ఆన్లైన్లో ప్రయత్నించిన ఒక వైద్యుడికి సైబర్‌నేరగాళ్లు రూ. 47.73 లక్షలు బురిడీ కొట్టించారు. మన్నెగూడకు చెందిన బాధితుడు వృత్తిరీత్యా వైద్యుడు.గత సంవత్సరం డిసెంబర్లో జుడియో ఫ్రాంచైస్ తీసుకోవడానికి ఆన్లైన్లో ప్రయత్నించాడు. జుడియో పేరుతో ఉన్న ఒక వెబ్సైట్లోకి వెళ్లి వాటెండ్ ఫ్రాంచైస్‌లో ఉన్న గూగుల్ ఫామ్‌లో వివరాలన్ని నింపి పంపించాడు. రెండు మూడు రోజుల్లో మీరు ఫ్రాంచైస్ తీసుకోవడానికి ఇష్టం చూపుతున్నందుకు ధన్యవాదాలు.
మా ప్రతినిధి మీతో మాట్లాడుతాడని మేసేజ్ వచ్చింది. అన్నట్లుగానే ప్రకాష్ అనే పేరుతో తాను ఫ్రాంచైస్ డెవెలప్మెంట్ మేనేజర్‌నని ఫోన్ చేశాడు. మీకు ఫ్రాంచైస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు మొదట రిజిస్టేష్రన్ ఫీజు చెల్లించండి, తర్వాత లైసెన్స్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ఎన్ఓసీ, అగ్రిమెంట్ ఫీజ్ అంటూ రూ. 47,73500 చెల్లించాడు. ఇంకా డబ్బు చెల్లించాలని అడుగుతుండడంతో తాను నేరుగా వచ్చి హెడ్ ఆఫీస్‌లో కలుస్తానని చెప్పాడు. ముంబాయిలో హెడ్ ఆఫీస్ ఉందంటూ తప్పుడు చిరునామాలు చెప్పి, సెల్‌ఫోన్‌ను స్వీచాఫ్ చేశారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.