సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 శాతం నేరాలు పెరిగాయి. మహిళలు, పిల్లలపై దాడులతో పాటు భౌతిక దాడులు, ఇతర నేరాలు పెరిగిన వాటిలో ఉన్నాయి. ఈ ఏడాది 33,040 కేసులు నమోదవ్వగా, గత ఏడాది ఈ సంఖ్య 28,626 ఉంది. ఈ ఏడాది సైబర్ నేరాలు 3,734 నమోదు కాగా.. గతేడాది ఈ సంఖ్య 4,618గా ఉంది. రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది పెరిగాయి. ఈ ఏడాది 3,488 నమోదు కాగా.. గతేడాది 3,207 నమోదయ్యాయి. సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కమిషనరేట్‌లోని డీసీపీలతో కలిసి 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీ దొంగతనాలు, హత్యాచార ఘటనలతో పాటు సైబర్ నేరాలు తగ్గాయని తెలిపారు. 26,852 కేసులు రిపోర్టు కాగా 21,056 కేసులు పరిష్కరించామని, 78 శాతం డిస్పోజల్ రేట్ సాధించామని వివరించారు. ప్రాపర్టీ క్రైమ్స్ 15 శాతం తగ్గాయని, విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, పలువురిపై సస్పెక్ట్ షీట్స్ తెరిచి, నేరస్తులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ఈ తగ్గుదల కనిపించిందన్నారు. 227 ఎన్డీపీఎస్ సస్పెక్ట్ కేసులు నమోదు చేశామన్నారు.
ఎన్డీపీఎస్ కేసుల్లో రూ. 20.01 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసి 495 మందిని అరెస్టు చేశామన్నారు. 4,121 నాన్ బెయిలబుల్ వారెంట్లు(ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూట్ చేసి, జీరో ఎన్బీడబ్ల్యూ కమిషనరేట్‌గా రాచకొండను తీర్చిదిద్దామని వెల్లడించారు. 31 నేరాల్లో 55 మంది నిందితులకు జీవిత ఖైదు, 12 కేసుల్లో 20 ఏండ్ల జైలు శిక్షలు పడడంతో కన్విక్షన్ రేట్లలో రాచకొండ రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించించిందన్నారు.
డయల్ 100కు వచ్చిన 2,44,849 కాల్స్‌ను అటెండ్ చేశామని, రెస్పాన్స్ టైమ్ 6.53 నిమిషాలు ఉందన్నారు. ఇలా ప్రతి రెండు నిమిషాలకు సుమారు డయల్ 100 ఒక కాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సెవెన్ వర్టికల్స్‌లో రాచకొండ కమిఫనరేట్ ప్రతి నెలా మొదటి స్థానాన్ని సాధించిందని వెల్లడించారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్‌తో పాటు ప్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ వంటి ప్రధాన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. 13,062 ఎఫ్ఐఆర్లు, 44,742 ఈ పెట్టీ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించామని వివరించారు.
పోలీసులకు మంచి జీతాలు వస్తుండడంతో ఉద్యోగాలకు వచ్చిన ఐదారేండ్లలోనే సొంత ఇళ్లు కొనాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని, దీంతో పోలీస్ క్వార్టర్స్‌లో ఎక్కువ మంది ఉండేందుకు ముందుకు రావడం లేదని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అవసరమైన చోట పోలీస్ క్వార్టర్స్‌ను బాగు చేస్తామని, అయితే ఇప్పుడు ఉన్నవే ఉపయోగించడం లేదన్నారు. గతంలో ఉద్యోగంలోకి వచ్చిన 25 సంవత్సరాలకు ఇళ్లు కొనేందుకు పోలీసు సిబ్బంది ప్రణాళికలు చేసుకునే వారని, నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడి కొందరు సిబ్బంది ఆర్థికంగా నష్టపోయి మానసికంగా కుంగిపోతున్నారని, దీనికి శాఖపరంగా కొన్ని విధానాలు తీసుకొచ్చి, అంతర్గతంగా అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
త్వరలోనే మేడిపల్లిలో నూతన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో 1300 మంది రౌడీషీటర్లు ఉన్నారని, ఈ ఏడాది కొత్తగా 75 మందిపై రౌడీషీట్లు తెరిచామన్నారు. ప్రతి ఏటా 18 వేల కొత్త వాహనాలు ట్రై కమిషనరేట్ పరిధిలో రోడ్లపైకి వస్తున్నాయని, ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, కారు పూలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. రాచకొండలో 74 శాతం శిక్షలు పడుతున్నాయని, రాష్ట్రంలో ఆయా నేరాల్లో అత్యధిక శిక్షలు పడుతున్న కమిషనరేట్ తమదేనన్నారు. మహిళలపై దాడులు, పోక్సో కేసులు 4 శాతం పెరిగాయని, పోక్సో కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్న పిల్లలను అసభ్యకరంగా తాకడం, లైంగిక వేధింపులు చేస్తున్నారని ఇలాంటి కేసులతో మానవ సంబంధాలు దిగజారుతున్నాయన్నారు, పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. షీ టీమ్స్ ఈ ఏడాది 156 ఎఫ్ఐఆర్లో నమోదు చేసిందని, 10,760 డెకాయి ఆపరేషన్లు నిర్వహించిందన్నారు. కమిషనరేట్‌లోని సిబ్బంది సమష్టి కృషితోనే ప్రధాన నేరాలను తగ్గించామన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు శ్రీధర్, అనురాధ, ఆకాంక్ష్ యాదవ్, నారాయణరెడ్డి, వి.శ్రీనివాసులు, మనోహర్, డి.శ్రీనివాస్, గుణశేఖర్, ఉషారాణి, నాగలక్ష్మి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.