సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): అరబ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన నిశాంత్‌కుమార్ రాయ్, ఈస్ట్ఢిల్లీలో అర్పిజ్ వెబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంప్యూటర్ సంస్థను నిర్వహిస్తున్నాడు. షైన్.కామ్, ట్రైమ్జాబ్స్.కామ్, నౌకరీ.కామ్ వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను కొనుగోలు చేస్తాడు. నోయిడాలో ఒక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి.. అక్కడ టెలీకాలర్స్‌తో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫోన్లు చేయించి, అరబ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మిస్తూ రిజిస్ట్రేషన్, వీసా ఫీ. జీఎస్టీ.. ఇలా రకరకాల ఫీజులు వసూలు చేసి చివరకు బాధితులను నట్టేట ముంచేస్తుంటారు. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడికి సౌదీ అరేబియలోని జీజాన్ యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి రూ. 4.71 లక్షలు వసూలు చేసి, మోసం చేశాడు. దీనిపై బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ బోస్‌కిరణ్ బృందం దర్యాప్తు చేపట్టి, ఢిల్లీలో నిందితుడు నిశాంత్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు ల్యాప్ టాప్‌లు, ఆరు మొబైల్ ఫోన్లు, 5 వైర్లెస్ ఫోన్లు, ఆరు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.