గ్రేటర్లో చిన్నపాటి గాలి వీచినా.. తేలికపాటి వర్షం కురిసినా విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గంటల కొద్దీ బ్రేక్డౌన్లతో సరఫరా నిలిచిపోతోంది. వేసవిలో గాలివాన వచ్చినప్పుడు బ్రేక్‌డౌన్ అవడం, హైఓల్టేజీ సమస్యలు, చెట్లకొమ్మలు తాకి ఫీడర్లు ట్రిప్పవడం వంటి విద్యుత్ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. పైగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటూ పలుచోట్ల చెట్లకొమ్మలు నరికేసినా అవన్నీ తాత్కాలిక పనులుగానే మిగిలిపోయాయి.
-సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ):
గాలి దుమారానికి చెట్లు కూలిపోతే వాటిని తొలగించే క్రమంలో వైర్లు బాగుచేశారే తప్ప ముందస్తు ప్రణాళికను దాదాపుగా అమలు పరచలేదు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చెట్లకొమ్మలు నరికేయడం ఒక భాగం కాగా చాలాచోట్ల ఇంకా కొమ్మలు అదే స్థితిలో ఉండడం కనిపిస్తోంది. కొమ్మల మధ్యలో కరెంట్ తీగలు ఉండడం మూలాన గాలి దుమారానికి, వర్షానికి చెట్ల కొమ్మలు ఊగడం, విరగడం వల్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయమేర్పడుతుంది.
విద్యుత్ లైన్లకు దగ్గరగా పెరిగే చెట్ల వల్ల విద్యుత్ అంతరాయమేర్పడుతున్నదని, వెంటనే అటువంటి పరిస్థితులను గుర్తించి పరిష్కరించాలని సీఎండీ ముషారఫ్ తమ అంతర్గత సమావేశంలో సిబ్బందితో చర్చించారు. ఎక్కడెక్కడా చెట్లలో విద్యుత్ తీగలు ఉన్నాయో వాటిని గుర్తించి అవి తొలగించే పరిస్థితి ఉందా.. లేకుంటే ప్రత్యామ్నాయమేంటనే విషయాలపై నివేదిక వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ సంవత్సరం వేసవి కంటే వానకాలంలోనే ఎక్కువగా కరెంట్ పోతున్న పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గ్రేటర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో ఉన్న పది సర్కిళ్లలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సర్కిళ్లతో పాటు మేడ్చల్ పరిధిలోని హబ్సిగూడ, మేడ్చల్ సర్కిల్, రంగారెడ్డి పరిధిలోని సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ , సరూర్‌నగర్ జోన్ల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఓవర్‌హెడ్‌లైన్లు ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ తెగిపడుతున్నాయి. సాయంత్రం వేళ విద్యుత్ సరఫరా నిలిచి పోతే గంటల తరబడి మళ్లీ పునరుద్ధరణ జరగడం లేదు. ప్రతి పనికి విద్యుత్‌తో ఊడిపడిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల కిందట వేసిన విద్యుత్ లైన్లు ఈదురు గాలులకు కిందపడిపోతున్నాయి. కొన్నిసార్లు తీగలు తెగుతున్నాయి. ఇన్సులేటర్లు పేలి సరఫరా నిలిచిపోతుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు చెట్ల కొమ్మల మధ్య ఉండడంతో గాలి వాన వచ్చినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఫీడర్లు ట్రిప్ అయి కరెంట్ సరఫరాకు అంతరాయమేర్పడుతుంది.
ఎస్పీడీసీఎల్ సిబ్బంది తమ పరిధిలోని ఫీడర్లలోవిద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యధికంగా అంతరాయం నమోదైన ఫీడర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పాం. ఫీడర్ల అంతరాయాలకు చెట్లకొమ్మలు విద్యుత్ తీగలపై పడడం మూలంగానే ట్రిప్ అవుతున్నట్లు గుర్తించాం. చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో విధిగా పెట్రోలింగ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించాం. వర్షాలు కురిసే సమయంలో సిబ్బంది ఎప్పుడూ తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పాం.
– ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ