హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్‌పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 4న యూసుఫ్‌గూడలో ఓటర్లు కార్డులను పంపిణీ చేశారు. ఈవ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకున్నది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి, యూసుఫ్‌గూడ సర్కిల్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 23 ప్రకారం ఓటు హక్కు కలిగిన ఓటర్‌కు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అఫీసర్ ద్వారా ఎన్నికల సంఘం నేరుగా ఓటర్‌కార్డును పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఈ గుర్తింపు కార్డులను రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదించిన, అధికారికంగా అనుమతి పొందిన ఏజెన్సీలు మాత్రమే ముద్రిస్తాయని ఎన్నికల కమిషన్ చెప్తున్నది. ఎలక్టోరల్ ఫొటో గుర్తింపు కార్డులకే చట్టబద్ధత ఉంటుందని ఎన్నికల అధికారులు వివరిస్తున్నారు. అందుకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశావహుడిగా ఉన్న నవీన్‌యాదవ్ ఏకంగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి, ఓటర్లకు గుర్తింపు కార్డులు స్వయంగా పంపిణీ చేశారు. ఈ వ్యవహారాన్ని ’నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు స్పందించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. సోమవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్‌కార్డులు పంపిణీ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.