Jalamandali | సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్ బస్తీ, కప్పుగడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న బి.రవి, బి.కృష్ణ, బి.కుమార్, బి.అంజయ్య, మహబూబి, కె.బాలరాజ్, టి.భాస్కర్లకు రెండేసి నల్లా కనెక్షన్లు ఉన్నాయి.
అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాలని కోరగా.. అందులో ఒక నల్లా కనెక్షన్‌కు మాత్రమే ధ్రువపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ఏడుగురు వినియోగదారులపై స్థానిక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీటి సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రికల్ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.
జలమండలి అధికారుల ఫిర్యాదు మేరకు ఏడుగురిపై పీడీపీపీఏ చట్టం సెక్షన్ 3, భారతీయ న్యాయ సంహిత 326(ఏ) 303 (2) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజీ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజీ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానికి 99899 98100, 99899 87135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.