హైదరాబాద్ : దేశంలోని కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులపై ఉక్కు పాదం మోపుతూ పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్న మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ( Narayana), సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. బుధవారం మేడే సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించి,హిమాయత్‌నగర్ నుంచి నారాయణగూడ వరకు ర్యాలీ నిర్వ హించారు.
అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. దేశ సంపదలైన సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టి గత పందేండ్లుగా కార్మిక వర్గంపై మోదీ సర్కార్ వేగవంతంగా దాడి చేసిందని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యతతో ముందుకు సాగి హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలని వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విఎస్బోస్, ఎఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్,రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, తదితరులు పాల్గొన్నారు.