ఘట్కేసర్, మే 30: నూతన నేరన్యాయ చట్టాలు, డ్రగ్స్ కట్టడి, నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఏస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సీపీ తరుణ్ జోషి పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్, నకిలీ విత్తనాల సరఫరా పట్ల పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, నివారించాలన్నారు. సరఫరా చేసే ముఠాలను గుర్తించి, పీడీ చట్టాన్ని ప్రయోగించాలన్నారు.
ఎన్డీపీఎస్ చట్టం అమలు తీరు పట్ల దర్యాప్తు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నూతన నేర న్యాయ చట్టాల ప్రకారం దర్యాప్తు విధానాలను పాటించాలన్నారు. రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు ఎన్డీపీఎస్ చట్టం కింద 92 కేసులు నమోదు అయ్యాయని, 181 మందిని అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. జూలై 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు- 2023 అమల్లోకి రానున్నాయని, ఈ నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం, అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన బృందాలు వ్యవసాయ అధికారులతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఎస్బీ డీసీపీ కరుణాకర్, అడ్మినిస్ట్రేషన్ డీసీపీ ఇందిరా, క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, సైబర్ క్రైమ్ డీసీపీ చంద్రమోహన్, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, అదనపు డీసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.