Hyderabad | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు. నకిలీ ఇంటి పన్ను రశీదులు, విద్యుత్తు బిల్లుల సమర్పించి కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఈ భారీ బాగోతాన్ని తెలంగాణ ప్రభుత్వం చాకచక్యంగా తిప్పి కొట్టింది. బోగస్ కోర్టు ఉత్తర్వులు, తప్పుడు రశీదుల గుట్టును రట్టు చేసింది. ఆ భూములు ప్రభుత్వానివేనని పక్కా ఆధారాలతో సమర్థంగా వాదనలు వినిపించింది. ఇదీ.. పైగా భూముల వ్యవహారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే ట్రక్కు టెర్మినల్ నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దాదాపు 214.02 ఎకరాల భూములను సేకరించింది. ఈ మేరకు అప్పట్లో అవార్డు (నంబర్ 1/1990, ఫైల్ నంబర్ ఐఏ 84/86)ను కూడా జారీ చేసింది. వీటిలో ‘పైగా’ భూములు కూడా ఉన్నాయి. కానీ, ఆ భూముల్లో సుమారు 50 ఎకరాలు తమవేనంటూ ఇద్దరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుకు సమర్పించారు. ఆ భూములను కాజేసేందుకు కుట్ర పన్నారు. సర్వే నంబర్ 725/21లో 7 ఎకరాల 31 గుంటలు, సర్వే నంబర్ 725/23లో 10 ఎకరాల 7 గుంటలు, సర్వే నంబరు 725/24లో 12 ఎకరాల 34 గుంటలతోపాటు మరికొన్ని ఇతర సర్వే నంబర్లలో ఉన్న ఆ భూములను తమ పూర్వీకులు ‘పైగా అథారిటీ’ నుంచి వేలంలో కొనుగోలు చేశారని పేర్కొంటూ ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ యాహియా ఖురేషీ, వట్టెపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్ హైకోర్టులో రెండు వ్యాజ్యాలను దాఖలు చేశారు. వాటిలోని అంశాలను నిజాం ఆస్తుల వివాద మూలాలకు సంబంధించినవిగా కోర్టు భావించింది. ఆ పిటిషన్లను సీఎస్-7 బ్యాచ్ కేసులుగా పిలిచే పిటిషన్లతో జతచేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్నది.
కుట్ర బట్టబయలైంది ఇలా..
శంషాబాద్‌లోని తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోరాదని హెచ్ఎండీఏ, పోలీసులను ఆదేశిస్తూ 1997లో హైకోర్టు రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని ఆ ఇద్దరు పిటిషనర్లు కోర్టుకు నివేదిస్తూ వస్తున్నారు. తద్వారా యథాతథ స్థితిని కొనసాగించేలా సింగిల్ జడ్జి నుంచి స్టేటస్కో ఆదేశాలను కూడా పొందారు. ‘పైగా’ భూముల వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ జరుపుతున్నందున ఆ ఇద్దరి పిటిషన్లను కూడా సీజే బెంచ్‌కి నివేదించాలని హైకోర్టు రిజిష్ర్టార్కు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆ రెండు వ్యాజ్యాలు ఇటీవల చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏజీ ఆఫీసులోని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది ఏ సంతోష్‌రెడ్డి ఈ కేసు ఫైళ్లను, వాస్తవ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడంతో కుట్ర వెలుగులోకి వచ్చింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏజీ హైకోర్టుకు నివేదించారు. గతంలో హైకోర్టు ఇచ్చినట్టుగా పిటిషనర్లు చెప్తున్న మధ్యంతర ఉత్తర్వులు బోగస్‌వేనని రుజువు చేశారు. వాటితోనే కోర్టును మోసగించేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని వాదించారు.
2007లోనే తెలంగాణ ఏర్పడిందట!
వాస్తవానికి హెచ్ఎండీఏని నిలువరిస్తూ గతంలో హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్న విషయాన్ని ఆధారాలతో సహా ఏజీ తెలిపారు. దీనితోపాటు పిటీషనర్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో 2007లోనే ‘తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ పంచాయతీ’ అని ఉన్న రశీదును హైకోర్టు దృష్టికి తెచ్చారు. తద్వారా పిటీషనర్లు సమర్పించినవి రశీదులు తప్పుడువని రుజువు చేశారు. దీంతో పిటిషనర్లు నివేదించిన నకిలీ ఉత్తర్వులు, రశీదుల్లో వివరాలను సమగ్ర పరిశీలించి వాస్తవ నివేదిక సమర్పించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా ఆ ఉత్తర్వులు, రశీదులను క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ.. అవన్నీ బోగస్‌వేనని తేల్చింది. అందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం సీల్డ్ కవర్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనానికి సమర్పించింది. దీంతో ఈ నివేదిక ప్రతులను అక్టోబర్ 3లోగా పిటిషనర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం స్పష్టం చేసింది. తమ తమ వాదనలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని పిటిషనర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
తప్పు మీద తప్పు
పిటిషనర్లు 2007, 2012లో సమర్పించిన రశీదుల్లో ‘తెలంగాణ రాష్ట్రం, శంషాబాద్ గ్రామం’ అని ఉండటంతోపాటు ఆ రెండు రశీదుల్లో చేతి రాత కూడా ఒకే విధంగా ఉండటం గమనార్హం. పైపెచ్చు 2007 నాటి రశీదులో పన్ను కట్టిన మొత్తం రూ.2 వేలు అని కాకుండా ‘రెండు వేళ్లు’ అని పేర్కొన్నారు. ఇదేవిధంగా 2012 నాటి రశీదులోనూ తప్పుగానే ఉన్నది. ఐదేండ్ల తర్వాత జారీచేసిన రశీదులోని దస్తూరీ కూడా ఒకే తరహాలో ఉన్నది.
న్యాయమూర్తి పేరులోనూ తప్పే!
1998లో హైకోర్టు జారీచేసినట్టుగా పిటిషనర్లు చెప్తున్న మధ్యంతర ఉత్తర్వుల కాపీలు నకిలీవని స్వయంగా హైకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. పైపెచ్చు నాటి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్డీ పట్నాయక్ పేరుకు బదులుగా ‘ఎండీ పట్నాయక్’ అని రాశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎండీ పట్నాయక్ అనే వ్యక్తి ఎన్నడూ న్యాయమూర్తిగా పనిచేయలేదు. దీంతో పిటిషనర్లు సమర్పించిన హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ నకిలీదని రిజిస్ట్రీ తేల్చింది.
మహా కుట్ర?
శంషాబాద్‌లో తొలుత 50 ఎకరాలను కాజేసిన తర్వాత పిటిషనర్లు మరో 140 ఎకరాలను కూడా అక్రమంగా వశం చేసుకోవాలని కుట్ర పన్నినట్టు సమాచారం. ఇప్పటికే వారు కబళించేందుకు ప్రయత్నించిన 50 ఎకరాల పక్కనే ప్రభుత్వానికి మరో 140 ఎకరాల భూమి ఉన్నది. ఈ 190 ఎకరాల భూమిని కాజేయాలన్న పిటిషనర్ల కుట్రను రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే అడ్డుకున్నది.