అల్వాల్, మార్చి 18: అల్వాల్ పట్టణ కేంద్రంలో ఫైర్ స్టేషన్ కోసం స్థలం, నిధులు మంజూరైనప్పటికీ.. భవనం నిర్మాణానికి మాత్రం నోచుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. బుధవారం అంసెబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. నియోజకవర్గలోని పలు అభివృద్ది కార్యక్రమాలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోతున్న నేపథ్యంలో సభాధ్యక్షులు (స్పీకర్) ద్వారా ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తూ కోర్టు కేసులను సమగ్రంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. అల్వాల్ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు అయినప్పటికీ కోర్టులో దావా వేసి స్టే తీసుకోవడం వల్ల పనులు నిలిచిపోయాయన్నారు.
మెతుకుంట, చెరువు బండ వంటి చెరువుల అభివృద్ధ్దికి నిధులు సిద్ధంగా ఉన్నా సివరేజ్ ఛానల్ డైవర్షన్ పై కోర్టు కేసులు వేసి పనులు అడ్డుకుంటున్నారని, దీనివల్ల చెరువులు కలుషితమై ప్రజలు రోగాలబారిన పడుతున్నారని వివరించారు. యూఎల్సీ భూముల విషయంలో కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మచ్చబొల్లారంలోని హిందూశ్మశానవాటికలో ఉన్న డంపింగ్ యార్డ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కరానికి ఏజీ తక్షణమే ఆదేశాలు జారీచేసి సంబంధిత జీపీలతో కలిసి అన్ని కోర్టు కేసులను సమీక్షించి వేంగంగా పరిష్కరించాలని మర్రి సభలో కోరారు.
పెండింగ్ బిల్లులు చెల్లించండి
మల్కాజిగిరి, మార్చి 18: పెండింగ్‌లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేసి, మల్కాజిగిరి కోర్టు భవనం నిర్మాణ పనులు పూర్తిచేసేవిధంగా సహకారం అందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు వివిధ అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుధవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. మల్కాజిగిరిలో నిర్మాణంలో ఉన్న కోర్టుల భవన సముదాయం(పోస్కో, ప్యామిలీ కోర్టులు) పనుల పురోగతి, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టు రూ.90 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతుండగా, ప్రస్తుతం దాదాపు రూ.2.80 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్మికులు, సరఫరాదారులకు చెల్లింపులు చేయలేక కాంట్రాక్టర్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేసి, కోర్టు భవన సముదాయం పనులను వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, సంబంధిత అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.