సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారని వాపోయారు. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో పనులు నిలిచిపోయి ప్రజలకు మరిన్ని అవస్థలు తప్పవనే సంకేతాలు కనబడుతున్నారు.
జీహెచ్ఎంసీతో తాడోపేడో తేల్చుకోవాలని కాంట్రాక్టర్లు పోరు బాటకు నిర్ణయం తీసుకున్నారు. గత జనవరి నెల నుంచి రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. జోనల్ కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతిపత్రాలు సమర్పించి.. ఏకంగా ఇందిరాపార్కు వద్ద రోజంతా ధర్నా చేపట్టి నిరసన చేపట్టారు. ఈ లోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో పురోగతిలో ఉన్న పనులు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బంద్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ గల్లా పెట్టే ఖాళీగా మారడం, ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ పనులకే చెల్లిస్తున్నారు. నాలా పూడికతీత పనులు, వర్షాకాల ముందస్తు పనులు, ఎస్ఎన్డీపీ పనులను కాంట్రాక్టర్లు చేపడుతున్నారు.
ప్రతి ఏటా వర్షాకాలంలో ముందస్తుగా వరద ముంపు నివారణ చర్యలు చేపడుతారు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలో పూడికతీత పనులు చేపడుతారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.45 కోట్లతో రూ.884.15 కిలోమీటర్ల మేర సుమారు ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తీసేందుకు కాంట్రాక్టర్లతో పనులు జరుపుతున్నారు. ఈ నెల 31వ తేదీ నాటికల్లా పూడిక తీత పనులు పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు 60శాతం కూడా పనులు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు పనులు మానేసి బంద్‌లోకి వెళ్తుండడంతో ప్రజలకు వరద ముంపు సమస్యలు తప్పేలా లేవు. మరోపక్క వర్షాలకు అత్యవసర బృందాల ఏర్పాట్లు, ఐఆర్టీ టీంలకు ప్రత్యేక సహాయక చర్యల పనులను అప్పజెప్పుతారు. ఈ పనులను సైతం మేం చేయబోమని కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీ చేయడం మరింత భయాందోళనకు గురి చేస్తున్నది.
జీహెచ్ఎంసీలో ప్రస్తుతం కొత్తగా ఏ పనులు మొదలు పెట్టాలన్న కాంట్రాక్టర్లే కాదు అధికారులు జంకుతున్న పరిస్థితి. సంస్థ ఆర్థిక పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుండడం, మరోపక్క అప్పుల కుప్ప పేరుకుపోతుండడంతో చేసిన పనులకు జీహెచ్ఎంసీలో బిల్లులు రావని జోరుగా ప్రచారం నడుస్తున్న తరుణంలో జీహెచ్ఎంసీ పిలిచిన టెండర్లకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో పనులకు మళ్లీ మళ్లీ టెండర్లు పిలవాల్సి వస్తుందని స్వయంగా అధికారులే చెబుతున్న పరిస్థితి. కాంట్రాక్టర్ల బంద్‌ను ఏ మేర అధికారులు నిలువరిస్తారో అన్నది వేచి చూడాల్సిందే.