Hyderabad | సిటీబ్యూరో: నిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మతులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందరు ఖాళీ స్థలాలు, చెరువులు, నాలాల పక్కన పడేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా.. గుట్టలు, గుట్టలుగా భవన వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బల్దియా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గడిచిన నెల రోజులుగా వ్యర్థాలను డంపింగ్ వేస్తున్న 1158 డెబ్రీస్ పాయింట్లను గుర్తించారు. తరచూ వేస్తున్న దాదాపు 762 పాయింట్లను గుర్తించి సంబంధిత డంపింగ్ చేస్తున్న వారికి జరిమానాలు విధించారు. గడిచిన 28 రోజుల వ్యవధిలో రూ.42.20 లక్షల మేర జరిమానాలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.