సిటీ బ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎవరో కట్టిన ఇంటికి సున్నం వేసి.. తామే కట్టించామని గొప్పలు చెప్పుకునే చందంగా మారింది. ఆంక్షలు, ఇనుప కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన రేవంత్‌రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన రెండు హాస్టల్ భవనాలను ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి, నిర్మాణాలు చేపట్టిన భవనాలను ప్రారంభించి ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో నిధుల వరద పారిస్తారని విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆశగా ఎదురు చూశారు. కానీ సీఎం మాత్రం యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికి వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి ఏం చేస్తామో కూడా చెప్పకుండా సమస్యలు తీరుస్తామని నోటి మాట చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.
నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేసి.. ఉద్యమకాలాన్ని తలపిస్తూ పర్యటించిన రేవంత్‌రెడ్డి యూనివర్సిటీకి చేసిందేమీ లేదని విద్యార్థులు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రెండు హాస్టల్ భవనాలను ప్రారంభించడానికి సీఎం రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. సీఎం పర్యటన ఆసాంతం శంకుస్థాపనలకే పరిమితమైందని ఎద్దేవా చేస్తున్నారు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడటానికి క్యాంపస్‌కు వచ్చారా అంటూ నిలదీస్తున్నారు. యూనివర్సిటీలో వసతుల కల్పనకు కనీసం వినతులను సైతం స్వీకరించడానికి నిరాకరించిన సీఎం.. ప్రపంచ స్థాయిలో ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించినవే&
ఓయూలో రెండు హాస్టల్ భవనాలను నిర్మించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం రూ.80 కోట్ల నిధులను విడుదల చేసింది. రెండు భవనాలకు అప్పటి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అప్పటి విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డికి భవనాల నిర్మాణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది.
కేటీఆర్, హరీశ్ పర్యవేక్షణలో నిర్మాణ పనులను రెండేండ్లలో పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సహా పలువురు తమ నిధులను కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తైన భవనాలను సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి పాటు పడతామని గొప్పలు చెప్పుకుంటున్నారని విద్యార్థులు ఎద్దేవా చేస్తున్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన భవనాలు, ఫ్లైఓవర్లన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవేనని, సొమ్మొకరిది.. సోకొకరిదనే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుందని విమర్శిస్తున్నారు. రెండేండ్లలో బీఆర్ఎస్ నిధులతో చేపట్టిన నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేసి తమ ఖాతాలో వేసుకోవడమే సరిపోతున్నదని ఆరోపిస్తున్నారు.
అడ్మినిస్ట్రేషన్ భవనానికి నిధులు మంజూరు..
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణం కొనసాగుతున్నది. పనులు వేగంగా కొనసాగితే మరో ఆరు నెలల్లో ఈ భవనం కూడా అందుబాటులోకి రానున్నది. ఈ భవనానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం 33.75 కోట్ల నిధులను విడుదల చేసింది. అధునాతన హంగులతో ఏండ్ల తరబడిగా సేవలందించే విధంగా నిర్మాణం చేపడుతున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రూ.37.50 కోట్ల వ్యయంతో సెంటినరీ హాస్టల్ నిర్మాణం పూర్తి చేశారు.
ప్రస్తుతం అది అందుబాటులో ఉన్నది. కేసీఆర్ చేసిన పనులనే తాము చేసినట్లుగా గప్పాలు కొడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శంకుస్థాపనలు తప్ప నిర్మాణాలు చేపట్టలేదని విద్యార్థులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు, నీటి మూటలకే పరిమితమవుతున్నదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. శంకుస్థాపనల కోసం విద్యార్థులను నిర్బంధించి ఓయూలో పర్యటించి… రేవంత్‌రెడ్డి సీఎం స్థాయిని దిగజారుస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.