సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టులో మరో భారీ మురుగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యంతో అద్భుతమైన టెక్నాలజీతో ఎస్టీపీల నిర్మాణం జరిగింది. రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా రూ. 3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యంతో 31 కొత్త ఎస్టీపీలను చేపట్టి ఏడు చోట్ల వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే నాగోల్‌లో 320 ఎంఎల్డీ సామర్థ్యంతో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) సాంకేతికతతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం భారతదేశంలోనే అతి పెద్దది కావడం విశేషం. ఇప్పటి వరకు యుఏఎస్బీఆర్ టెక్నాలజీ, ఎంబీబీఆర్ టెక్నాలజీ కంటే కొత్తగా, అందులో ఎస్బీఆర్ టెక్నాలజీతో భారీ ఎస్టీపీ నిర్మాణం ఇదేనని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎస్బీఆర్ టెక్నాలజీలో చిన్న ఎస్టీపీలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి. 320 ఎంఎల్డీ సామర్థ్యంతో దాదాపు 800 కోట్ల వ్యయంతో.. 24 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ఎస్టీపీని 16 నెలల్లోనే పూర్తి చేసి..రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ ప్రారంభించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ప్రాజెక్టు విభాగం అధికారుల నిరంతర పర్యవేక్షణలో నిర్ణీత సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. కాగా సదరు నిర్మాణ సంస్థ 15 ఏండ్ల నిర్వహణకుగానూ రూ. 400కోట్ల ఖర్చు చేయనుంది.
అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఎస్టీపీల నిర్మాణం జరిగింది. మెట్రో నగరాల్లో స్థలాభావం కారణంగా ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే చాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి.. తకువ విస్తీర్ణంలో ఎకువ నీటిని శుద్ధి చేస్తాయి. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి తకువ ఖర్చు అవడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ఇది తేలికైన విధానం. దీనికి విద్యుత్తు వినియోగం కూడా తకువ. యుఏఎస్బీఆర్ టెక్నాలజీ, ఎంబీబీఆర్ టెక్నాలజీ కంటే ఎస్బీఆర్ టెక్నాలజీతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మూడు గంటల వ్యవధిలోనే మూడు విడతల్లో మురుగునీటి శుద్ధి జరిగి, తాగేందుకు తప్పా నిర్మాణ రంగానికి, పార్కులు, వాహనాల వాషింగ్, ఇతర అవసరాలకు ఈ వాటర్‌ను వినియోగించవచ్చు. నిరంతరం స్కాడా విధానంలో పర్యవేక్షణ, అధునాతన శుద్ధి విధానం ఎస్బీఆర్ సొంతం అని అధికారులు చెబుతున్నారు.
మూసీ నది పునర్జీవమే లక్ష్యంగా.. దక్షిణ భాగాన ఐదు ఎస్టీపీల నిర్మాణ బాధ్యతలను తీసుకున్నాం. 480.50 ఎంఎల్డీ సామర్థ్యంతో నాలుగు ప్రాంతాల్లో 5 ఎస్టీపీల నిర్మాణానికి గానూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగా 70 ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టిన అనుభవం మా సంస్థకు ఉంది. మురుగు ముంపుతో క్షీణిస్తున్న మూసీ నదిని పునరుద్ధరణలో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఎస్బీఆర్ టెక్నాలజీతో విద్యుత్ వినియోగం తక్కువ. పర్యావరణ ప్రభావాన్ని సైతం తగ్గిస్తుంది. ఇప్పటికే కోకాపేటలో 15 మిలియన్ లీటర్ల శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చాం. నాగోల్‌లో 170 ఎంఎల్డీ, ఇక్కడే 320 ఎంఎల్డీ ఎస్టీపీని తీసుకువస్తున్నాం. త్వరలో మిరాలం వద్ద ఎస్టీపీని అందుబాటులోకి తీసుకొస్తాం.