రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడుతున్నది. రాత్రికి రాత్రే అక్రమ వెలుస్తున్నాయి. తాజాగా కుర్మల్‌గూడ సర్వేనంబర్ 80లోని స్థలం ఆక్రమణకు యత్నించగా, అధికారులు జేసీబీతో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
బడంగ్‌పేట, ఏప్రిల్16: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్ గూడ సర్వే నంబర్ 80లో ఉన్న ప్రభుత్వ భూమిని యధేచ్ఛగా కబ్జా చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. రాత్రికి రాత్రి పెద్దపెద్ద షెడ్లు వెలిశాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బిగ్ స్కెచ్ వేశారు. గతంలోనే ఆ భూమిని కాజే యడానికి ఏకంగా వెంచర్ చేశారు. ప్లాట్లుగా చేసి కొంతమందికి విక్రయించారు. గతంలో ఉన్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అది ప్రభుత్వ భూమిగా గుర్తించి ప్లాట్లుగా చేసిన వాటిని తొలగించి.. సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు.
కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న భూ ఆక్రమణదారులు మరోసారి కబ్జా చేయడానికి ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఏకంగా షెడ్లు వెలిశాయి. స్థానికులు తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఇందిరా దేవి ఆదేశాల మేరకు అధికారులు అక్రమ నిర్మాణాలన్నింటినీ జేసీబీతో తొలగించారు. కాగా, బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఇందిరా దేవి చెప్పారు. ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రి నిర్మాణాలు వెలుస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కూర్మల్ గూడ సర్వేనంబర్. 80 లో ఉన్న భూమి అంతా ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు.