వనస్థలిపురం, అక్టోబర్ 26 : ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు రైతులు, దళితులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ ధ్వజమెత్తారు. రైతుబంధు, దళిత బంధు పథకాలను ఆపాలని ఆ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ ఆయన ఆధ్వర్యంలో పనామా చౌరస్తా వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త పథకాలు ప్రవేశపెట్టవద్దన్నారు. ఉన్న పథకాలను కొనసాగించవచ్చన్నారు. ఆ మాత్రం ఇంగితం లేకుండా పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్‌గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం మల్లేశ్‌గౌడ్, సంజయ్, లత ఆనంద్‌రాజ్, మధుగౌడ్, గడల రాజు నాయి, పద్మ, వెన్నెల, రామేశ్వరమ్మ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హస్తినాపురం అధ్యక్షుడు అందోజు సత్యం చారి ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మనాయక్, హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ నారగోని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి, సయ్యద్ పాషా, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
చంపాపేట, అక్టోబర్26: ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని నల్ల రఘుమారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వెంటనే నిలిపి వేయాలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తూ గురువారం చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్ చౌరస్తాలో బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
అనంతరం కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత నల్ల రఘుమారెడ్డి పాల్గొని మాట్లాడుతూ… నేటికి అభ్యర్థుల సీట్ల కేటాయింపే ఎటు తేల్చుకోలేక తర్జన, భర్జన పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎలాగో ఓడిపోక తప్పదని భావించి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపి వేయాలని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వ్యాఖ్యాలు వింటుంటే ఇంటిని చక్కబెట్టుకోలేనమ్మ పొరుగింటిపై పోరుకు సై, అన్న చందంగా ఉందన్నారు. ఎవ్వరెన్ని వ్యాఖ్యలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్దే విజయం, కేసీఆరే ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా రఘుమారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.