GHMC Council | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ పురుష కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, సీఎన్‌రెడ్డి దాడి చేశారని, మహిళా కార్పొరేటర్లపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని, చీరకొంగు పట్టుకుని గుంజారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మన్నె కవిత, హేమ సామల, రాసూరి సునీత, దేదీప్యరావు తదితరులు ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో వారు మాట్లాడుతూ కౌన్సిల్ మీటింగ్‌లో తమపై జరిగిన దాడి గురించి వివరించారు. నలుగురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లపై దాడి చేసిన బాబా ఫసియుద్దీన్, సీఎన్రెడ్డిలు ఏ పార్టీ కండువాతో గెలిచారో మరిచిపోయారన్నారు.
బల్దియా చరిత్రలోనే తొలిసారి..
కార్పొరేటర్ మన్నె కవిత
తమ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్లు నలుగురిపై అత్యంత దారుణంగా దాడి చేశారని, ఇలా చేయడం జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారి అని బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత అన్నారు. తోటి మహిళ అయిన మేయర్ తన తోటి మహిళలను గౌరవించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని , బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవమానించారు: కార్పొరేటర్ సునీత రాసూరి
తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే.. తాము తీసుకెళ్లిన పేపర్లను చించేశారని, మళ్లీ పేపర్లు తీసుకొని పొడియం దగ్గరకు వస్తే బయటకు పంపించారని కార్పొరేటర్ సునీత రాసూరి అన్నారు. దళిత మహిళ అని చూడకుండా తనను మేయర్ విజయలక్ష్మి అగౌరవపరిచారన్నారు.
దాడి చేశారు..: కార్పొరేటర్ దేదీప్యారావు
‘బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మా సంఖ్యతో గెలిచిన మేయర్ విజయలక్ష్మి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు.. బడ్జెట్లో చాలా అవకతవకలున్నాయి.. మొదట ప్రశ్నల తర్వాత బడ్జెట్ పెట్టమని అడిగితే మాపై దాడి చేశారు’ అని కార్పొరేటర్ దేదీప్యరావు అన్నారు.
భద్రత లేదు: కార్పొరేటర్ హేమ సామల
కౌన్సిల్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మేయర్ ముందు మహిళా బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ పురుష కార్పొరేటర్లు దాడి చేస్తుంటే మేయర్ ఖండించకపోగా.. మార్షల్స్‌ను పిలిచి తమను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని కార్పొరేటర్ సామల హేమ అన్నారు.