Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక రకరకాల జిమ్మిక్కులు ఆడుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని కుయుక్తులు చేసిందని ఆరోపించారు. కానీ ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఆశాభంగం తప్పదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలు లేరని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దీనిపై ముస్లిం వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వస్తున్నాయని అన్నారు. ప్రజలకు చేసేందేమీ లేక.. చెప్పుకోవడానికి ఏమీలేక తిట్ల పురాణంతో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎంతసేపు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను నిందించడం తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పుకునే విధంగా ఏదీ చేయలేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి హైడ్రా దెబ్బ తగులుతుందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓటమి భయంతోనే ఇప్పుడు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు. ఓటర్లను కొనే ప్రయత్నంలో భాగంగా ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇచ్చే పనిలో మంత్రులు బిజీగా ఉన్నారని అన్నారు. ఎన్ని చేసినా ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.