సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీలో నానాటికీ గందరగోళం పెరిగిపోతున్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గం ఉప ఎన్నికపై అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ హడావుడి మొదలుపెట్టి పెద్ద ఎత్తున సర్వేలు చేయించుకున్నది. కానీ ‘హస్త’వాసి బాగాలేదని తేలడంతో మంత్రుల హడావుడితోనైనా పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడం ఒక ఎత్తయితే… అభ్యర్థి ఎంపికపై నేతల మధ్య రచ్చ తారాస్థాయికి చేరుకుంటున్నది.
శనివారం ఒకేరోజు నగర ఇన్చార్జి మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కౌంటర్ ఇవ్వడంతో కాంగ్రెస్ టికెట్ వ్యవహారం రంజుగా మారింది. ఒకవైపు పొన్నం ‘స్థానిక’ వాదాన్ని వినిపించగా.. అంజన్ మాత్రం సీనియార్టీ వాదంతో సవాల్ విసిరారు.
ముఖ్యంగా కొంతకాలంగా రాష్ట్రంలో బీసీ వాదానికి తామే చాంపియన్ అంటూ క్లెయిమ్ చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ హైడ్రామా నడిపిస్తుండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం బీసీకి టికెట్ ఇవ్వాలనే రూలేమీలేదనే రీతిలో మంత్రి పొన్నం వ్యాఖ్యానించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. కాగా, నిన్నటిదాకా జూబ్లీహిల్స్ టికెట్‌పై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రూపంలో రచ్చ కొనసాగగా… అది పోగానే ఇప్పుడు అంజన్‌కుమార్ యాదవ్ రూపంలో తెరపైకి వచ్చి నగర రాజకీయాన్ని వేడెక్కిస్తున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెరపైకి వచ్చినప్పటి నుంచి టికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మాజీ క్రికెటర్, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌ను ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానం బరి నుంచి తప్పించింది. ముఖ్యంగా ఆది నుంచి మంత్రి ఒకరు అజార్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయితో పాటు రాష్ట్ర పార్టీలో చక్రం తిప్పుతూ వచ్చారు. అది ఫలించి… చివరకు అధిష్ఠానం ఎమ్మెల్సీ రూపంలో అజార్‌ను బుజ్జగించింది.
అయితే ఎలాగూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దుస్థితి ఏమిటనేది దగ్గరి నుంచి చూసిన అజార్.. ఓటమి కంటే ఎమ్మెల్సీనే బెటర్ అనే నిర్ధారణకు వచ్చారు. దీంతో టికెట్ వ్యవహారంలో పెద్ద అడ్డంకి తొలగిపోయిందని రాష్ట్ర పార్టీ భావిస్తూ వచ్చింది. కానీ అనూహ్యంగా శనివారం ఒక్కసారిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తన స్వరాన్ని పెంచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానికుడికే టికెట్ అంటూ మంత్రి పొన్నం ప్రకటించారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే దీనిపై అంజన్‌కుమార్ కౌంటర్‌కు దిగారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ… ఏకంగా జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకంటే సీనియర్ ఎవరైనా టికెట్ కోరితే వారికి ఇవ్వండి అంటూ సవాల్ విసిరారు.
పనిలో పనిగా పొన్నం ప్రస్తావన కూడా తీసుకువచ్చి ఆయన తనకంటే జూనియర్ అంటూ చురక అంటించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ కుటుంబం వెంట నడిచిందని, అప్పుడు గుర్తుకురాని అభ్యంతరం ఇప్పుడెందుకు? అని ప్రశ్నించారు. ఏం…ఒక ఇంట్లో ఇద్దరికి అవకాశాలు లేవా? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అనేది స్థానికులకే కాదని.. ఓపెన్ అంటూ కుండబద్దలు కొట్టారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేశానంటూ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. దీంతో అజార్ పోయిండనుకుంటే అంజన్ వచ్చాడంటూ పార్టీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చి ఇప్పుడు జనాన్ని అరిగోస పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ .. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నది. 20 నెలలుగా జూబ్లీహిల్స్‌నే కాదు… అసలు హైదరాబాద్ నగరాభివృద్ధినే గాలికొదిలిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా నియోజకవర్గంలో భారీ హామీలను గుప్పిస్తున్నది. నిత్యం కోట్లాది రూపాయల అభివృద్ధి పనులంటూ శిలాఫలకాలను మాత్రం నింపుతున్నది. వాస్తవానికి ఉప ఎన్నిక అంశం తెరపైకి రాగానే ఓ మంత్రి తనకు చెందిన టీవీ చానల్‌తో అనేక సర్వేలు చేయించి కాస్త హల్చల్ చేశారు.
అన్ని సర్వేల్లోనూ అభ్యర్థి ఎవరైనా పార్టీకి మాత్రం ప్రతికూల ఫలితాలే తేలడంతో పార్టీలో అయోమయం నెలకొన్నది. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడి చివరకు అభివృద్ధి పేరిట జనాన్ని మభ్య పెట్టేందుకు తెర లేపారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగాలేదనే నిర్ధారణకు వచ్చిన అధిష్ఠానం ఏకంగా ముగ్గురు మంత్రులతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతల్ని రంగంలోకి దింపి శంకుస్థాపనల పర్వాన్ని కొనసాగిస్తున్నది. జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టికెట్ కోసం ప్రయత్నించే ఆశావహుల సంఖ్య తగ్గిపోతున్నది. దీంతో మంత్రులు పాల్గొనే సమావేశాల్లో అభ్యర్థి ఎవరంటూ పార్టీ శ్రేణులు వేసే ప్రశ్నలకు మంత్రులు కూడా సమాధానం చెప్పలేక దాటవేయాల్సిన పరిస్థితి నెలకొంది.