జూబ్లీహిల్స్, నవంబర్11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓ డివిజన్ పరిధిలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు యత్నించిన కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ భగ్నం చేసింది. కృష్ణానగర్‌లో ఓటువేసేందుకు వచ్చిన ఫేక్ ఓటర్ల(స్థానికేతరులు)ను గుర్తించిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలింగ్ ముగిసే చివరి గంటలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పక్కా ప్రణాళికతో స్థానిక మహమూద్ ఫంక్షన్ హాల్లో స్థానికేతర మహిళలను, యువతులను సిద్దంగా ఉంచిన విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆందోళనకు దిగారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి సతీష్, కార్పొరేటర్లు.. వెల్దండ వెంటటేశ్, రాజ్‌కుమార్ పటేల్, సామల హేమ తదితరులు దొంగ ఓటర్లను గుర్తించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్ వద్ద వందలాది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో స్థానికేతర మహిళలు భయంతో బయటకు రాకుండా లోపలే ఉండిపోయారు. పోలింగ్ ముగిసేవరకు బీర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉండటంతో సబంధిత డివిజన్లో కాంగ్రెస్ నేతల రిగ్గింగ్ పాచిక పారలేదు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడినుంచి తరలించారు.