Congress Party | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్ నగర్ డివిజన్లోని రామ్ నరేష్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో 50 మంది నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరారు. ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. గత ఎన్నికలలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై… పచ్చిఅబద్దాలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలలో పేదలకు మొండి చెయ్యి చూపారని, రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు తగిన నిధులు కేటాయించలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షాత్తు అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయలేమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని… ఏడాది గడుస్తున్నా నేటికీ తులం బంగారం ఉసే లేదని విమర్శించారు. అబద్ధపు హామీలతో సర్కార్ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్న మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన నాయకులు బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
పార్టీలో చేరిన వారిలో వెంకటయ్య, అర్జున్ రెడ్డి, డి.రాము, మహేష్, ప్రతాపరెడ్డి, చిట్టిబాబు, రాములు గౌడ్, మహేందర్, నరసింహ, రవీందర్, నారాయణరెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధం శ్రీకాంత్, నక్క శ్రీనివాస్, కలీం తదితరులు ఉన్నారు.