హైదరాబాద్: బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav ) హెచ్చరించారు. బీసీ బంద్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము బంద్‌లో పాల్గొంటున్నామని, ఇచ్చిన హామీ అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ, చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీల నాయకులు సిగ్గు లేకుండా రోడ్లపైకి వచ్చారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని, దానిని గవర్నర్‌కు పంపారని, అది గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్, ఆ తర్వాత జీవోలను తీసుకొచ్చిందని విమర్శించారు. బీసీలను మోసం చేయడానికి అనేక డ్రామాలు ఆడుతున్నారని, మా ఆత్మ గౌరవం కోసం మేము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తమ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు. 22 నెలల కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి 9 వ షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత లభిస్తుందని తెలియదా అని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తామని వివరించారు.