 
                                                            సిటీబ్యూరో, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చేసిన పన్నాగం బూమరాంగ్ అవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తే.. చివరకు ఆ పార్టీలకే కార్యకర్తలు, ముఖ్య నేతలు ముఖం చాటేస్తున్నారు. బద్ధశత్రువు ఎంఐఎం దోస్తీ కట్టిన కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర స్థాయి నేతలకు ఉన్న దోస్తానా కమలం కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. దీంతో ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు రాష్ట్ర నేతలపై గుర్రుగా ఉంటూ ఒక్కొక్కరిగా పార్టీకి దూరమవుతున్నారు.
ఒక్క జూబ్లీహిల్స్ స్థానం కోసం రెండు జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు కలిసి చేసిన ఎన్నికల వ్యూహం బెడిసికొడుతోంది. బీఆర్ఎస్ను నిలువరించడమే లక్ష్యంగా ఇరు పార్టీలకు చెందిన ఢిల్లీ నేతలు గల్లీలో ఒప్పందం చేసుకుంటే… ఓటర్లు, క్షేత్రస్థాయి కార్యకర్తలు మంత్రాంగానికి విరుగుడు ప్రయోగిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరికి రెండు పార్టీల నేతలకు షాకిచ్చినట్లుగా కండువా మార్చేస్తున్నారు. అభ్యర్థి ఖరారు నుంచే ఇరు పార్టీల వ్యవహారంపై కార్యకర్తలు, పార్టీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. ఎంఐఎంతో కలిసి దోస్తీ కట్టి, పార్టీ నిర్వీర్యం కావడంపై కమలం కార్యకర్తలు భరించలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం లోపాయికారి పొత్తుతో పార్టీకి నష్టం జరుగుతుందని మండిపడుతున్నారు.
ఇరు పార్టీలోని ముఖ్య నేతలు కలిసి ఉప ఎన్నిక ద్వారా లబ్ధి పొందాలనే ప్రణాళికలను ఆ పార్టీ కార్యకర్తలే సహించలేకపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్కు దీటుగా బరిలో అభ్యర్థిని దించకుండా అస్త్ర సన్యాసం చేయడాన్ని కింది స్థాయి, డివిజన్ స్థాయి నేతలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
దీంతోనే రాష్ట్ర నేతల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఓట్లన్నీ తమ పార్టీకి మళ్లించుకోవాలనే కుటిల బుద్ధికి కింది స్థాయి నేతలు చెక్ పెడుతున్నారు. ఎంఐఎంతో కలిసిన ఆ పార్టీతో మిలాఖత్ కావడాన్ని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతోనే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లుగా డివిజన్ స్థాయి నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు మరో 13 రోజులు ఉండగానే షాకిచ్చినట్లుగా బీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారు. ఇక ప్రచారానికి వెళ్లిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి కూడా తమ ఓటు ఈసారి బీఆర్ఎస్కే అంటూ ఓటర్లు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.
 
                            