హైదరాబాద్: తిండికి ముందుంటా.. పనికి వెనుకుంటా అన్న చందంగా నగరంలో కాంగ్రెస్ సర్కారు (Congress Govt) వ్యవహారిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అకాల మరణంతో.. జూబ్లీహిల్స్లో (Jubilee Hills) అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అప్పటి నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతర మొదలుపెట్టిన నేతలు.. సరిగ్గా ఎన్నికల నాటికి శిలాఫలకాలను గాలికొదిలేసినట్లుగా ఎక్కడా మొదలు పెట్టిన పనులు అక్కడే వదిలేశారు. కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగర వ్యాప్తంగా అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు.. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనే రూ. 150 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సనత్నగర్ లోతట్టు ప్రాంతంలో పర్యటన వరకు అన్ని కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే అన్నట్లుగా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు గెలిపిస్తే గానీ అభివృద్ధి చేసే ఉద్దేశమే లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ యాదవ్, నియోజకవర్గ ఓటర్లకు ఇదే విషయాన్ని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ కార్డులను పంపిణీ చేసిన ఆయన సంక్షేమ పథకాలు అందాలన్నా… అభివృద్ధి పనులు మొదలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందేనంటూ తేల్చి చెబుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో సుమారు రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రులే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేస్తే అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని,లేదంటే జరగవని బహిరంగా సభల్లో మంత్రులే ఓటర్లను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమను గెలిపిస్తేనే శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేస్తామంటూ ప్రజలను చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చేస్తారా.. లేకుంటే ప్రజా సంక్షేమం పట్టించుకోరా అంటూ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఖాజానా ఖాళీ అయిందని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపిస్తే అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి ఇస్తారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రెండు నెలల ముందే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆ దిశగానే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బోరబండ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి రోడ్లను తవ్వి పనులు అసంపూర్ణంగా వదిలేశారు. దీంతో అంతర్గత రహదారులన్నీ మూతపడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పెద్దమ్మ నగర్ ప్రధాన కూడలి వద్ద రోడ్డు తవ్వడంతో పెద్ద గుంత ఏర్పడింది.ఇకడే డ్రైనేజీ పైప్ లైన్ పగిలిపోవడంతో మురుగు నీటితో గుంత నిండిపోయింది. రాత్రి వేళలో ఈ మార్గంలో రాకపోకలు సాగించే, పాదచారులు వాహనదారులు మురుగు నీటి గుంతలో పడి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు.
పదేండ్ల లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు.గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బోరబండ లో అభివృద్ధి కుంటుపడింది.మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది అదునుగా భావించిన కాంగ్రెస్ పార్టీ మరో మారు ప్రజలను మోసం చేసేందుకు అభివృద్ధి పనుల పేరుతో స్వయంగా మంత్రులే వచ్చి కోట్లాది రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రులు శంకుస్థాపనలు చేసిన మరుసటి రోజే అంతర్గత రోడ్లన్నీ తవ్వేశారు. రాకపోకలకు వీల్లేకుండా రాళ్ల కుప్పలు పోరుకుపోయాయి. రోజులు గడుస్తున్న పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. అనేకమార్లు పనులు ప్రారంభించాలని అధికారులను కోరిన.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ప్రజలు మండి పడుతున్నారు.