సుల్తాన్ బజార్, జూలై 7: కార్మికుల శ్రమ దోపిడీని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం గోషామహల్ కన్వీనర్ పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 8 గంటల స్థానంలో 10 గంటలు పనిచేయాలన్న నిబంధనను వెనక్కి తీసుకోవాలన్నారు.
బేగంబజార్లోని సీపీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పి.నాగేశ్వర్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రమ దోపిడీని పెంచేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేలా అసలైన 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. ఆ కార్మిక చట్టాల స్థానంలో బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు.
వాటిని రద్దు చేయాలని కార్మిక సంఘాలన్నీ ఈ నెల 9వ తేదీన సమ్మెకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి జీవో 282ను తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు ఇవ్వడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించిరు. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత మంచిది కాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.