మేడ్చల్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏండ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు భూ క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. రెండో విడత భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58,59 జీవో కింద లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిశీలనను పూర్తి చేశారు.
అనంతరం అర్హులను గుర్తించి జీవో 58, 59 కింద భూ క్రమబద్ధీకరణ చేయాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో భూ క్రమబద్ధీకరణ వాయిదా పడింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా.. 58, 59 జీవో కింద చేపట్టాల్సిన భూ క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యం వహిస్తున్నదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న భూ క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 58, 59 జీవో కింద భూ క్రమబద్ధీకరణపై అధికారులను లబ్ధిదారులు సంప్రదిస్తే తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
58,59 జీవోలో అత్యధికం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచే అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల నుంచి అత్యధిక నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. 58 జీవో కింద 26,205, 59 జీవో కింద 15,602 దరఖాస్తులు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో 41 బృందాలు దరఖాస్తుల ఆధారంగా నేరుగా నివాసాల వద్దకు వెళ్లి పరిశీలన చేసి అర్హులను గుర్తించి నివేదికలను జిల్లా కలెక్టర్ లాగిన్‌కు అప్లోడ్ చేశారు. 58, 59 జీవోల నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం ఎప్పుడు జరిగింది… ఇంటికి సంబంధించిన ధ్రువీకరణపత్రాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో నమోదు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే ఉన్న వాటినే అర్హులుగా గుర్తించినప్పటికీ దరఖాస్తులకు మోక్షం ఎప్పుడు అన్న ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.