ఎల్బీనగర్ ( హైదరాబాద్) : కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) ఆరోపించారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ ( Scholarship ) బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొత్తపేట నుంచి దిల్సుఖ్నగర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంట్రాక్టర్లకు (Contractors) కోట్లాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారని, విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్థికశాఖ మంత్రికి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉందని విమర్శించారు.
మంత్రి తన వైఖరి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నిరవధికంగా బంద్ చేస్తామని అన్నారు. స్కాలర్షిప్, ఫీజు బకాయిలు రూ. 4 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని కోరారు. రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లాపల్లి అంజి, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్, సి. రాజేందర్, అనంతయ్య, రామకృష్ణ, రమాదేవ్, నీలకంటేష్, మహేష్, బలరాం, రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.