సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా నీరు కలుషితం కావడం వల్ల డయేరియా, కామెర్లు తదితర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
దీనిని దృష్టిలో పెట్టుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. 2020లో వరదలు వచ్చినప్పుడు నాటి ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో దాదాపు నెల రోజుల పాటు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌కు మాత్రం ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నగరంలో ఇటీవల కురిసిన భారి వర్షాలతో గత నెల 25రాత్రి మూసీనది గేట్లు తెరిచిన విషయం తెలిసిందే. దీంతో గత నెల 26 సాయంత్రం వరకు మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా మలక్‌పేట పరిధిలోని మూసానగర్, శంకర్‌నగర్, అంబేద్కర్ నగర్, వినాయక వీధి, మూసారాంబాగ్ తదితర ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి.
దీంతో స్థానిక బస్తీలు, కాలనీలలోని ప్రజలు కట్టు బట్టలమీదా నివాసాలు విడిచి బయటకు రావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రభావిత ప్రాంతాల్లో వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్తా చెదారం, బురద పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. అంతే కాకుండా వరద తీవ్రత కారణంగా అక్కడ ఉన్న మంచినీటి వ్యవస్థలన్నీ కలుషితమైనట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. అయితే వరదలు వచ్చి, వారం రోజులు గడిచినా అక్కడ ఎలాంటి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టలేదు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అటు ఆరోగ్యశాఖ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కనీసం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించకపోవడంపై గమనార్హం. ఒక పక్క సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా మరో పక్క వరదలతో అంటువ్యాధుల వ్యాప్తి పొంచి ఉన్నా, సంబంధిత అధికారులు కనీసం వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు.
వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయని, దోమల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వరదలతో సర్వం కోల్పోయి, ఇబ్బందుల్లో ఉంటే మరో పక్క అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు.
వరదల కారణంగా పేరుకుపోయిన బురద, మురుగు కారణంగా దోమలు బెడద పెరిగిందని, దీంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని అంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు దోమల నివారణ చర్యలు, అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.