సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. చిన్న పిల్లలు, వృద్ధుల ఆకలి కేకలు కాంగ్రెస్ సర్కారుకు వినిపించడం లేదు. మూడు రోజులుగా నిత్యావసరాలు, సామగ్రి ధ్వంసమై తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఆకలి, దప్పికలతో అల్లాడుతున్న పేదల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పునరావాసం, పరిహారం అందించి అండగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు సైతం బస్తీల వైపు వెళ్లడం లేదు.
అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ముంపు బారిన పడ్డ బస్తీలను గాలికొదిలేశారు. దీంతో ఎవరైనా వచ్చి తమకు ఆహారం, మంచి నీళ్లు, పాలు అందిస్తారేమోనని దీనంగా ఎదురుచూస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న కొద్దిపాటి ఆహారాన్ని తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమకు పరిహారం ఇవ్వకపోగా కనీసం ఆహారమైనా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, ఇంట్లో సామగ్రి మొత్తం ధ్వంసం కావడంతో తిరిగి సంపాదించుకునేందుకు సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్యం ఇకనైనా స్పందించి భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. సామగ్రి కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.
మూసీ పరీవాహక బస్తీలైన మూసానగర్, శంకర్ నగర్, వినాయక వీధి, ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ మూసీ వరదల్లో పూర్తిగా మునిగిపోయాయి. పైకప్పు దాకా వచ్చిన వరద వల్ల దాదాపు ఐదు వందలకు పైగా ఇండ్లలోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. కట్టుబట్టలతో బస్తీల ప్రజలు రోడ్డున పడ్డారు. వరదలు సంభవించినప్పుడు రెవెన్యూ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బస్తీ ప్రజలు చెబుతున్నారు. కనీసం వరద తగ్గుముఖం పట్టినాక బస్తీలవైపు కన్నెత్తు చూడటం లేదని వాపోతున్నారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఎంత మందికి, ఎంత మేర నష్టం జరిగిందో అంచనా వేయాల్సిన కలెక్టర్, రెవెన్యూ అధికారుల జాడే లేదంటున్నారు. మూడు రోజులుగా ఏ ప్రభుత్వ అధికారి తమ బస్తీల్లోకి రాలేదంటున్నారు. మూడు రోజులుగా ప్రభుత్వం నుంచి తమకు నిత్యావసరాలు, భోజనం సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి బస్తీల్లో సర్వేలు చేయాలని కోరుతున్నారు. నష్టపోయిన వారికి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. మూసీ ముంపు ప్రాంతాలకు ప్రభుత్వ అధికారులెవరూ రావడం లేదని బస్తీల ప్రజలు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం తాము బస్తీల్లో పర్యటిస్తున్నామంటున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది వరద బాధితుల వివరాలు సేకరిస్తున్నారని అంటున్నారు. కానీ అధికారులు ఎక్కడా కనిపించడం లేదని బాధితులు పేర్కొంటున్నారు.
మూసీ వరదల్లో పరీవాహక బస్తీలు పూర్తిగా మునిగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నా జిల్లా కలెక్టర్ నుంచి కనీస స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులవుతున్నా కలెక్టర్ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని మండిపడుతున్నారు. సాధారణ సమయాల్లో హైదరాబాద్ నగరంలోని కాలనీలు, బస్తీల్లో నిత్యం పర్యటించే కలెక్టర్ హరిచందన ఇప్పుడు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తున్నారు. వరద బాధితులకు అండగా ఉండాల్సిన జిల్లా మెజిస్ట్రేట్ స్థానంలో ఉన్న అధికారి కనీసం స్పందించకపోవడం పట్ల మూసానగర్, శంకర్‌నగర్, వినాయక వీధి, మూసారాంబాగ్, అంబేద్కర్ నగర్ బస్తీల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉండాల్సిన అధికారులు కార్యాలయాలను వదిలి బయటకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మూడు రోజులుగా తిండి, నిద్ర లేక అల్లాడుతున్న మూసీ ముంపు బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించకపోయినా తామున్నామంటూ భోజనం, సరకులు అందిస్తూ తోచిన సాయం చేస్తున్నాయి. కొన్ని సంస్థల ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. మరికొందరు పాలు, మంచి నీటిని అందిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన సాయాన్ని వారు చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు చేయాల్సిన సాయం మీరు చేస్తున్నారంటూ బస్తీ వాసులు సంతోషిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలను చూసైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని కోరుతున్నారు.
మూసీలో వరద ఉద్ధృతి పెరుగుతుందని అధికారులు మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. కనీసం పునరావాస కేంద్రాలకు తరలించలేదు. వరదలో మా ఇండ్లు మొత్తం మునిగిపోయి సామానంతా ధ్వంసమైనా ప్రభుత్వ అధికారులెవరూ ఇప్పటిదాకా బస్తీలోకి రాలేదు. కనీసం ఆహారం కూడా పంపిణీ చేయలేదు. మొదటి రోజు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు మాత్రం బురదను తొలగించి వెళ్లారు. ఇండ్లలో బురద వల్ల ధ్వంసమైన సామగ్రిని తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. బస్తీల్లో ఉండేవాళ్లంతా కూలీ పనులు చేసుకునేవాళ్లే. ఆధారం కోల్పోయి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి మా బస్తీల్లో పర్యటించి, నష్టపోయిన వారందరికీ పరిహారం ఇవ్వాలి. కొద్దిరోజుల పాటు మాకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయాలి.
– ఇసాఖ్, మూసానగర్ బస్తీ
మూసీ ముంచెత్తిన వరద వల్ల ఇండ్లన్నీ మునిగి సర్వస్వం కోల్పోయాం. ఇంట్లో సామగ్రి మొత్తం ధ్వంసమైంది. దాదాపు రూ.2 లక్షల దాకా నష్టపోయాను. నాలాగే బస్తీ వాసులంతా తమ ఇండ్లలోని నిత్యావసరాలు, సామాను కోల్పోయారు. మూడు రోజులైనా ప్రభుత్వ అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కొంత మంది స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి భోజనం, కొన్ని సరకులు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం మాకు ఇప్పటిదాకా ఏమీ అందలేదు. వరద వస్తుందని ముందే హెచ్చరిస్తే కొంత సామాను మా వెంట తీసుకెళ్లేవాళ్లం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చి మాకు జరిగిన నష్టాన్ని గుర్తించాలి. అందుకు తగిన నష్ట పరిహారం అందించాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
-అమీనా బేగం, మూసానగర్ బస్తీ