సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి /సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్‌కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్‌ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్యంగా విప్పామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడిందా? మొదటి దశను టేకోవర్ చేస్తే రూ.43వేల కోట్ల రెండో దశకు కేంద్రం ఒక్కసారిగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందనుకున్న తరుణంలో రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ప్రకటన రూపంలో ఝలక్ పడిందా? కిందపడినా పైచేయి నాదేనంటూ… ఎల్అండ్టీ నుంచి చౌకగా మెట్రోను కొనుగోలు చేశానంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాదనలు డొల్లనేనా? ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వీటన్నింటికీ అవును అనే సమాధానం ఇస్తున్నది. అంతేకాదు.. ఇదిగో టేకోవర్! అదిగో రెండో దశ!! అంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. వచ్చే మార్చిదాకా ఆగాల్సిందేనన్న స్పష్టతను కేంద్ర మంత్రి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాన్ని గందరగోళంలో నెట్టినట్లయింది.
హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ పేరిట కాంగ్రెస్ సర్కారు రూ.43వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రాజెక్టును నెలకొల్పుతామంటూ ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 162 కిలోమీటర్ల మేర తొమ్మిది కారిడార్లకు డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. పీపీపీ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన వాటాదారులుగా భారీ నిధులతో చేపడుతామంటూ ప్రణాళికలు రచించింది. కానీ డీపీఆర్ రూపకల్పన చేసి, కేంద్రానికి చేరినా ఇప్పటికీ దీనిపై ఒక్క అడుగు ముందుకు పడలేదు. మెట్రో విస్తరణపై కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఒకేసారి రూ.43వేల కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో కారిడార్లను గుర్తించి అనుమతుల అంశాన్ని పరిశీలిస్తామని తేల్చడంతో కాంగ్రెస్ సర్కారును ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.
జనసంచారమే లేని ఫోర్త్ సిటీకి మెట్రో నిర్మాణం, ప్రాజెక్టు ఆలైన్‌మెంట్‌లో మార్పులతో నగరంలో మెట్రో విస్తరణ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం చేశారు. అందులో భాగంగా జనసమూహ ప్రాంతాలను విస్మరించి, ప్రాధాన్యత లేని ప్రాంతాలతో మెట్రో ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యంగా ఫోర్త్ సిటీ పేరిట రియల్ ప్రయోజనాలతో ప్రణాళికలను రూపొందిస్తే, వాటికి అడ్డు తగిలినట్లుగా అనుమతుల్లోనే లోపాలున్నాయంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. ఇక రెండో దశ మెట్రోకు అనుమతులపై స్పష్టత రావాలంటే.. తొలి దశలోని 69 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో మార్గాన్ని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ భాగస్వామ్యంపై వివరణ కోరింది. స్పష్టత వచ్చేంత వరకు అనుమతులు ఇవ్వలేమని తేల్చింది. దీంతో ఒక్క నిర్ణయంతో… రూ.43వేల కోట్ల రెండో దశ మెట్రోకు పచ్చజెండా ఉపక తప్పని అనివార్య పరిస్థితుల్లోకి కేంద్రాన్ని నెట్టివేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావించింది. కానీ తాజా పరిణామాలను చూస్తే అది బూమరాంగ్ అయిందా? అని అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల దక్షిణాది రాష్ర్టాల్లోని పట్టణాల అభివృద్ధిపై హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గతంలో కేంద్రానికి సమర్పించిన మెట్రో రెండో దశ రూ.43వేల కోట్ల ప్రతిపాదనలపైనా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ-ఎ, రెండో దశ-బీ అంటూ రెండు భాగాలుగా రెండో దశను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ రెండు దశల్లో ఏకంగా తొమ్మిది కారిడార్లు (మార్గాల్లో) రూపకల్పన చేయగా… వాటిల్లో ఐదారు కిలోమీటర్ల కారిడార్లతో పాటు గరిష్ఠంగా 27 కిలోమీటర్ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే ఖట్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో రెండో దశను పరిశీలిస్తామని హామీ ఇచ్చే సమయంలోనే గంపగుత్తగా కాకుండా ప్రాధాన్యతాక్రమంలో కారిడార్ల వారీగా అనుమతులు ఇస్తామంటూ బాంబు పేల్చారు.
అంటే కేంద్రం రూ.43వేల కోట్ల ప్రతిపాదనలకు ఒకేసారి ఆమోదం ఇవ్వదనే కీలమైన నిర్ణయాన్ని ఖట్టర్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. పైగా వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ అనుమతులపై స్పష్టత ఇస్తామని కూడా తేల్చి చెప్పారు. తద్వారా మెట్రో రెండో దశపై మరో నాలుగైదు నెలల్లో కేంద్రం నుంచి ఎలాంటి ఆశాజనక పరిస్థితులు లేవని తేలిపోయింది. ఆ తర్వాతనైనా కేంద్రం పెద్ద కారిడార్‌ను ముందుగా పరిగణలోనికి తీసుకుంటుందా? ఎల్బీనగర్-హయత్‌నగర్, ఎల్బీనగర్-నాగోల్, మియాపూర్-పటాన్చెరు వంటి చిన్న కారిడార్లకు తొలుత అనుమతులు ఇస్తుందా? అనే దానిపైనా ప్రస్తుతం గందరగోళం నెలకొంది. దీంతో ఒకేసారి రూ.43వేల కోట్ల జాక్‌పాట్ కొట్టేయాలనుకుని ఎల్అండ్టీ నుంచి మెట్రో మొదటి దశను టేకోవర్ చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తాజా కేంద్ర నిర్ణయం మింగుడుపడనిదిగా మారిందని అధికారులే అంటున్నారు.
ఒక అబద్దాన్ని గట్టిగా చెబితే నిజమవుతుందా? ఓ తప్పుడు లెక్కను గుక్క తిప్పుకోకుండా వినిపిస్తే అంకెలు సక్రమం అవుతాయా? ఎన్నటికీ కావు… మరి సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో అబద్దాలనే నమ్ముకున్నారు. తప్పుడు లెక్కలనే వల్లె వేస్తున్నారు. ప్రజలు ఏమీ ఆలోచించరు… తానేమి చెప్పినా గుడ్డిగా నమ్ముతారని భ్రమిస్తున్నారు. కానీ మరో పదేండ్ల పాటు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ భారాన్ని మరో పదేండ్ల పాటు ఒక ప్రైవేటు కంపెనీ మోయకుండా దానిని జనంపై మోపారు. ఒక ప్రైవేటు కంపెనీ చెల్లించాల్సిన రూ.13వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై రుద్దారు. పైగా ఆ కంపెనీకి అదనంగా, ఉన్నపలంగా రూ.2వేల కోట్ల మొత్తాన్ని సర్కారు ఖజానా నుంచి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు వెనక ఉన్న అసలు కథ… దాగి ఉన్న వాస్తవాలేమిటో మీరే చూడండి.
హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు సుమారు 70 కిలోమీటర్లు ఉంది. కిలోమీటరుకు రూ.320-350 కోట్లు అవుతుంది. ఈ చొప్పున రూ.25వేల కోట్ల వరకు అవుతుంది. భూసేకరణ ఖర్చుతో కలిపితే అది రూ.33వేల కోట్లు అవుతుంది. కానీ నేను రూ.15వేల కోట్లకే ఎల్అండ్టీ నుంచి తీసుకున్నాను. ఎల్అండ్టీ నుంచి తీసుకున్న 250 ఎకరాల భూముల్ని అమ్ముకుంటే ఆ రూ.15వేల కోట్లు వస్తాయి.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా ప్రజలకే లాభం అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. తాను కొనుగోలు చేసిన తీరుతో కేటీఆర్, కిషన్‌రెడ్డికి నోటి మాట రావడం లేదన్నారు. మరి వాస్తవం అందుకు భిన్నం. ఎలాగంటే… హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఉండి ఉంటే… ఒప్పందం ప్రకారం 2035 వరకు అంటే మరో పదేండ్ల పాటు ఎల్అండ్టీ కంపెనీ నిర్వహణ బాధ్యతను మోసేది. అంటే నగరవాసులకు 2035 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వంపై రూపాయి భారం లేకుండా మెట్రో రైలు అందుబాటులో ఉండేది. దాని వల్ల వచ్చే లాభమో, నష్టమో ఎల్అండ్టీ కంపెనీనే చూసుకునేది.
ఒప్పందం ప్రకారం… 2035 సంవత్సరంలో ఎల్అండ్టీ కంపెనీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి, కట్టుబట్టలతో బయటికి పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒప్పందం ప్రకారం అప్పగించిన 250 ఎకరాలను కూడా ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును కొనుగోలు చేయకుండా ఉండి ఉంటే ఈ పదేండ్ల పాటు ప్రభుత్వంపై చిల్లిగవ్వ భారం లేకుండా 2035లో మెట్రో రైలు ప్రాజెక్టు, 250 ఎకరాల భూములు ఎల్అండ్టీ కంపెనీకి నయాపైసా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేవి. కానీ పదేండ్ల ముందే ప్రభుత్వం కొనడం వల్ల 2035 వరకు ఎల్అండ్టీ మోయాల్సిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. పైగా ఎల్అండ్టీకి ఉన్న రూ.13వేల కోట్ల అప్పు, ఆ కంపెనీకి అప్పనంగా ప్రభుత్వం చెల్లిస్తానన్న మరో రూ.2వేల నగదు… ఇలా రూ.15వేల కోట్ల భారం అదనంగా ప్రభుత్వంపై పడింది. మొత్తానికి ఇక్కడ ఎల్అండ్టీ లాభపడింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో ఉన్న 68 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి ఎల్అండ్టీ ఖర్చు చేసింది… రూ.14,480 కోట్లు. భూసేకరణకు – రూ.1040 కోట్లు, సివిల్ నిర్మాణ పనులు – రూ.5,550 కోట్లు, సిగ్నలింగ్, ఇతరత్రా వ్యవస్థలు రూ.5,680 కోట్లు, రైలు (బోగీలు) – రూ.1810 కోట్లు. అంటే కిలోమీటరుకు రూ.213 కోట్లు ఎల్అండ్టీ ఖర్చు చేసి నిర్మించింది. కానీ సీఎం మాత్రం కిలోమీటరుకు రూ.320-350 కోట్లు అవుతుందన్నారు. పైగా వెయ్యి కోట్లు అయిన భూసేకరణకు రూ.8వేల కోట్లు అయిందని అబద్దాలు వల్లించారు. అంటే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విలువ రూ.14,480 కోట్లు. సీఎం చెబుతున్న రూ.33వేల కోట్లు అనేది అబద్దం. పైగా రూ.14,480 కోట్లు అయిన మెట్రో ప్రాజెక్టును రూ.15వేల కోట్లకు ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేశారనేది వాస్తవం.
ఎల్అండ్టీ నుంచి తీసుకున్న 250 ఎకరాలను అమ్ముకుంటే రూ.15వేల కోట్లు వస్తాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2010 సంవత్సరంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం… 250 ఎకరాలను ప్రభుత్వం ఎల్అండ్టీకి ఇచ్చింది. 35ఏండ్లపాటు ఈ భూములు ఎల్అండ్టీ వద్ద ఉంటాయి. వాటిని ఆ కంపెనీ లీజుకుగానీ సొంతంగా వాణిజ్యపరంగా గానీ వినియోగించుకోవచ్చు. ఆతర్వాత అంటే 2035 సంవత్సరంలో తిరిగి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్లు ఎల్అండ్టీ నుంచి మెట్రో ప్రాజెక్టును కొనుగోలు చేయకపోయినా మరో పదేండ్ల తర్వాత 250 ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేవి.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిర్వహణ కోసమే నెలకు సుమారు రూ.50 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ టికెట్లు, ఇతరత్రా రూపాల్లో వచ్చే ఆదాయం రూ.25 కోట్లు దాటడం లేదు. ఏడాదికి రూ.600 కోట్ల వ్యయం అవుతుంటే… ఆదాయం రూ.450 కోట్లు కూడా రావడం లేదు. హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణానికి ఎల్అండ్టీ రూ.13వేల కోట్లు అప్పు తెచ్చింది. దానికి సంవత్సరానికి రూ.960 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నది. మొత్తంగా సంవత్సరానికి రూ.1560 కోట్లు చెల్లింపులకు కావాల్సి ఉంటే.. వచ్చే ఆదాయం రూ.450 కోట్లు. అంటే లోటు రూ.1110 కోట్లు. ఎల్అండ్టీ కంపెనీ మరో పదేండ్ల పాటు 2035 వరకు ఈ రూపంలో భారాన్ని మోయాల్సి వచ్చేది. అంటే పదేండ్లకు రూ.11,100 కోట్లు మోయాల్సి ఉండేది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టును కొనుగోలు చేయడం వల్ల ఎల్అండ్టీ ఈ భారం నుంచి విముక్తి పొందింది.
అదనంగా రూ.2వేల కోట్లను పొందింది. మరి ప్రభుత్వం 2035 వరకు ఎల్అండ్టీ మోయాల్సిన నిర్వహణ, నష్టాల భారాన్ని మోయక తప్పదు. సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్లు 250 ఎకరాలను అమ్మితే రూ.15వేల కోట్లు వస్తాయంటే అప్పు కింద రూ.13వేల కోట్లు, ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లకు ఈ మొత్తం సరిపోతుంది. కానీ 2035 వరకు పదేండ్ల పాటు నిర్వహణ భారం ఏటా రూ.150 కోట్లు (600-450) భారాన్ని ప్రజలపై పడక తప్పదు. ఒకవైపు విలువైన 250 ఎకరాల భూముల్ని కోల్పోయి… ఇంకోవైపు పదేండ్ల పాటు వేల కోట్ల నిర్వహణ భారాన్ని భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న రియల్ మాంద్యం ప్రభావంతో ఆ భూములు అమ్ముడుపోకపోతే… ఏటా రూ.1110 కోట్ల చొప్పున 2035 వరకు ఎల్అండ్టీ మోయాల్సిన రూ.11,100 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభు త్వం మేయాల్సిందే. ఇలా మొత్తంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా మెట్రో ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేయకపోతే 2035లో రూపాయి చెల్లించకుండానే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనమయ్యేది. 250 ఎకరాల భూముల్ని అప్పుడు అమ్ముకుంటే (ఏటా ఐదు శాతం వృద్ధి ప్రకారం) 2035లో రూ.22,500 కోట్ల మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది.