హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): చాలీచాలనీ జీతాలు.. కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పేదలకు ఆ పల్లెలే ప్రపంచం. ఇన్నాళ్లు ఉన్నది తిని.. తృప్తిగా బతుకుతున్న పేదోడిని ఆర్థికంగా నలిపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ లోపల విస్తరించి ఉన్న 51 గ్రామాల పల్లెవాసుల జేబులను పన్నులతో కొల్లగొట్టేందుకు సమాయత్తమవుతున్నది. పల్లెలకు దూరమై పురపాలికల్లో చేరుతున్న ప్రజలకు ఆస్తి పన్ను గుదిబండలా మారనున్నది. పొట్ట కూటి కోసం పెట్టుకునే కిల్లీ కొట్టు నుంచి కిరణాకొట్టు వరకు ట్రేడ్ లైసెన్స్‌లు తప్పనిసరికానున్నాయి. మున్సిపాలిటీల్లోకి మారిన తర్వాత ఇంటికే కాదు.. ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలాలకు కూడా పన్నులు వసూలు చేసి రేవంత్ సర్కారు ఖజానా నింపుకోనున్నది.
గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల ముందుగా పేదోడిపై ఆస్తి పన్ను భారం పడనున్నది. వీటితోపాటు ట్రేడ్ లైసెన్స్, మున్సిపాలిటీ నల్లా నీళ్లు, వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ పేరిట మరిన్ని పన్నుపోటులు పడనున్నాయి. ఒక్కో ఇంటిపై అదనంగా ఏటా పన్నుల రూపంలో రూ. 5వేల నుంచి 10వేల వరకు ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేయనున్నది. గ్రామాల్లో ప్రస్తుతం చదరపు గజానికి ఇంటి విలువలో 0.15 నుంచి 1 శాతం మేర పన్ను వసూలు చేస్తుండగా.. మున్సిపాలిటీల్లో చేరగానే అదే ఇంటికి చదరపు అడుగుకు రూ. 10-50 చొప్పున వసూలు చేస్తారు.
150 గజాల ఇంటికి ఏటా సుమారు రూ. 6వేల నుంచి 8వేలు వరకు ఆస్తి పన్ను చెల్లించాల్సిన దుస్థితి రానున్నది. ఒకవేళ నిర్మాణంలో జరిగే చిన్న చిన్న లోపాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనధికారిక నిర్మాణం(యూసీ) ట్యాక్స్ పేరిట ఇంటి పన్ను మొత్తానికి సమానంగా ఏటా పెనాల్టీ విధించనున్నది. అదే గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిర్మించుకునే కమర్షియల్ బిల్డింగులపై ఇకపై రెండింతల మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తే, దానిలో నిర్వహించుకునే దుకాణాలు, షాప్‌లకు అదనంగా రూ.3వేల నుంచి రూ. 50వేల వరకు ట్రేడ్ లైసెన్స్ పేరిట స్థానిక మున్సిపాలిటీలు వసూలు చేయనున్నాయి.
గ్రామాల్లో ఖాళీ స్థలాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మున్సిపాలిటీల్లో ప్లాట్ ధరలో 0.5-0.8 వరకు పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 100 గజాల ఖాళీ ఇంటి జాగపై కనీసం మున్సిపాలిటీల్లో రూ. 480-1015 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటిపై ఏడాదికి కనీసం రూ. 5వేల నుంచి రూ. 10వేల పన్ను భారం పడనున్నది. గ్రామాల్లో ఉపాధి నిమిత్తం నిర్వహించుకునే హెయిర్ కటింగ్, ఇస్త్రీ దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఎవరికీ మినహాయింపుల్లేవు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇన్నాళ్లు గ్రామాల్లో ఉన్న సౌలతులకు తగినట్టుగానే పన్నులు చెల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు పల్లెలు, తండాలు, హామ్లెట్ విలేజీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల పల్లె వసతులకే.. టౌన్ తరహా ట్యాక్సులు అదనంగా చెల్లించాల్సి రానున్నది. మున్సిపాలిటీల్లో మారగానే ఒక్కసారి మౌలిక వసతులు అభివృద్ధి చేసే వీలు లేదు. కానీ పల్లె జనాల నుంచి పన్నుల రూపంలో భారీ మొత్తంలో వసూలు చేసి కాంగ్రెస్ సర్కార్ ఖజానా నింపుకొనున్నది. ఇలా పల్లెకు దూరమై మున్సిపాలిటీల్లో కలుస్తున్న గ్రామీణవాసులపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుపోటు పొడవనున్నది.