సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని ప్రజలందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత తాగునీటిని సరఫరా చేసింది. 20 కేఎల్ల నీటిని ఉచితంగా అందించడంతో ప్రజలపై బిల్లుల భారం పడకుండా చూసుకున్నారు. ఉచిత తాగునీటి పథకం ద్వారా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతి పౌరుడు లబ్ధి పొందాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఆగమేఘాల మీద జీహెచ్ఎంసీని విస్తరించి.. దానికి సమాంతరంగా జలమండలి పరిధిని పెంచింది.
ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా.. ప్రజలకు తాగునీరందించేందుకు కనీస వసతులు కల్పించకుండా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని మున్సిపాలిటీలను జలమండలిలో విలీనం చేశారు. విలీనం చేసిన గ్రామాలు, మున్సిపాలిటీలకు ఉచిత నీటి పథకాన్ని వర్తింపజేయకపోగా.. పాత జీవోను సాకుగా చూపుతూ 2021 నాటి నుంచి పెండింగ్ బిల్లుల పేరిట గుదిబండను మోపుతున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత తాగునీటి పథకాన్ని జీహెచ్ఎంసీ సహా తమకూ వర్తింపజేయాలని సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జలమండలి వ్యాప్తంగా 14 లక్షల 60 వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి.
ఇందులో 6 లక్షలకు పైగా విలీన గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఓఆర్ఆర్ లోపలి 194 గ్రామాలు, 25 స్థానిక సంస్థలను విలీనం చేశారు. ఆయా ప్రాంతాలకు జలమండలి తాగునీటి సరఫరానూ విస్తరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీతో పాటు జలమండలిని విస్తరించినా వసతుల కల్పన దిశగా అడుగులు పడటం లేదు. అయితే ఉచిత తాగునీరు మాత్రం జీహెచ్ఎంసీ పరిధి వరకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. విలీన ప్రాంతాలకు కూడా ఉచిత తాగునీటి పథకాన్ని వర్తింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.