కందుకూరు: రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఇన్చార్జి వ్యవసాయ అధికారి లావణ్యను ఎంత మంది రైతులకు రుణమాఫీ అయిందని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సబితాఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రుణమాఫీ 50 శాతం మందికి కూడా కాలేదని, చాలా మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ నేటికీ తిరుగుతున్నట్లు చెప్పారు. రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం రైతు సంబురాలను నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంత మందికి రుణ మాఫీ చేశామనే నివేదికలు అధికారుల వద్ద లేవన్నారు.
సంక్రాంతి తర్వాత రైతు బంధు వేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని ఆయన మాటలను ఎంత వరకు నమ్మాలని చెప్పారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.