సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు ముస్లింలను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శంషాబాద్‌లో సోమవారం మైనార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీలకు ప్రాతినిథ్యం లేని ఏకైక ప్రభుత్వం తెలంగాణలో నడుస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయిస్తామని, సబ్‌ప్లాన్ తీసుకొస్తామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసే కాంగ్రెస్ వారి కోసం చేసేది ఇదేనా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో రెండేండ్లు పూర్తయ్యాయని మరో మూడేండ్లలో కూడా చేసేదేమీ లేదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. 2018 ఎన్నికల్లో గెలిచిన మహమూద్ అలీని కేసీఆర్ ఉప ముఖ్యమంత్రిని చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్సీ కూడా లేరని.. కనీసం ఎమ్మెల్యే కోటాలోనైనా ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. షబ్బీర్ అలీ, అజహరుద్దీన్ కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? ఎమ్మెల్సీ ఇస్తున్నామని అజహరుద్దీన్‌ను మోసం చేశారని క్రికెట్లో ఆయన కట్ షాట్లు కొడితే.. రేవంత్‌రెడ్డి ఆయననే కట్ చేశారని దెప్పిపొడిచారు. ఇప్పటినుంచి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు మైనార్టీలంతా ఏకం కావాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
భారతదేశంలో మైనార్టీలకు కేసీఆర్ చేసినన్ని పనులు దేశంలో ఎవరూ చేయలేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘మైనార్టీల కోసం ప్రత్యేకంగా స్కూళ్లను ప్రారంభించారు. ఆ స్కూళ్లలో చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు. మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు. తెలంగాణలోని 45 లక్షల మైనార్టీల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని ఇతర రాష్ర్టాల్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం హైడ్రా పేరిట వాళ్ల ఇండ్లను కూలుస్తున్నారు. రెండేండ్లలో రేవంత్‌రెడ్డి ఏం చేశారని అడిగితే కేసీఆర్ పేరును తీయడం.. కేసీఆర్‌ను గుర్తు చేసుకోవడం తప్ప ఏమీ లేద’ని ఎద్దేవా చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో పాటు మరో తొమ్మిది మంది పార్టీ మారారని వారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అవుతానని రేవంత్‌రెడ్డి ఏనాడూ అనుకోలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వమని కేటీఆర్ విమర్శించారు. అందుకే రేవంత్‌రెడ్డి మోదీ స్కూళ్లో చదివాను.. చంద్రబాబు కాలేజీకి వెళ్లాను.. రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని బహిరంగంగానే చెప్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మోదీని చౌకీదార్ అంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఆయన పెద్దన్న అంటారంటూ విమర్శించారు. సీబీఐ, ఐటీ వంటి సంస్థలు మోడీ జేబు సంస్థలని రాహుల్ గాంధీ విమర్శిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తారని మండిపడ్డారు.
ఏడాది క్రితం మంత్రి పొంగులేటి ఇంటిపై రెండు సార్లు రైడ్స్ చేశారని, నోట్లు లెక్కపెట్టే మిషన్లు లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలను ప్రజలంతా చూశారని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాదు..అంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని స్పష్టం అవుతుందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి బంధువులకు కాంట్రాక్టులు వస్తాయి.. బదులుగా బీజేపీ తెచ్చిన చట్టాలను అమలు చేస్తారని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ముందే బీజేపీ చట్టాలను అమలు చేస్తూ బడేభాయ్కు రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు.