సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ)/ఎర్రగడ్డ: జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నగరానికి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భారీ మొత్తంలో అన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద కటౌట్లు ఉంచారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ తొలగించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నిబంధనలుకు విరుద్ధమంటూ రజతోత్సవ వేడుకకు ముందు రోజు రాత్రే పూర్తిగా లేకుండా చేశారు. కానీ.. ఖర్గేకు స్వాగతం పలుకుతూ శుక్రవారం నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను మాత్రం కనీసం ముట్టుకోలేదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు దర్శమిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు ఆ ఫ్లెక్సీలు కనిపించడం లేదా..? కాంగ్రెస్ పార్టీకి నిబంధనలు వర్తించవా..? కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఒక న్యాయం… బీఆర్ఎస్ పార్టీకి మరొక న్యాయమా..? అంటూ నగర ప్రజలు నిలదీస్తున్నారు. అధికారులు అన్ని పార్టీలు, అందరు నేతల పట్ల ఒకే విధంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించవద్దని సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. హైడ్రా, జీహెచ్ఎంసీ నిబంధనలు అందరికీ సమానమే కదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండాలంటూ సూచిస్తున్నారు. కూల్చివేతల్లో చురుకుగా పనిచేసే హైడ్రా అధికారులు కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం మొద్ద నిద్ర పోతున్నదని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు.
బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో ఏడాది పొడవునా కాంగ్రెస్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా.. ఇక్కడ కటౌట్లను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. తాజాగా గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత బస్ టెర్మినల్లో రెండు భారీ కటౌట్లను ఏర్పాటు చేశాడు. బల్దియా అధికారులు మాత్రం వాటిని తొలగించకపోవడం గమనార్హం. అత్యంత రద్దీగా ఉండే బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో అధికారులు వెంటనే ఆ కటౌట్లను తొలగించాలని.. ఇక నుంచి వాటి ఏర్పాట్లను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.