జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు దింపుడు కళ్లం ఆశతో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభాల్ని ఎదుర్కోవడం, నాగార్జున, అల్లు అర్జున్ వంటి అగ్రనటులను కక్షసాధించడం, ఇండస్ట్రీ పెద్దలతో నిర్వహించిన సమావేశాల్లో నియంతృత్వ ధోరణి, వేతనాల పెంపు సమ్మె చేసిన సమయంలో సీఎం వేసిన కమిటీతో సినీకార్మికులు అన్యాయానికి గురవడం, తదితర పరిణామాలతో మెజార్టీ కార్మికుల్లో రేవంత్ సర్కారుపై తీవ్ర అసంతప్తి నెలకొంది. అయితే ఉప ఎన్నిక వేళ ఆగ్రహావేశాలతో ఉన్న కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు సన్మాన సభ పేరు జిమ్మిక్కు చేశారు ముఖ్యమంత్రి.
ఎంప్లాయీస్ ఫెడరేషన్‌ను పురమాయించి మంగళవారం యూసుఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్స్‌లో తనకు సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం షూటింగ్‌లు సహా అన్ని కార్యక్రమాలను బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్తో ఓ ప్రకటన కూడా ఇప్పించారు. ఇన్నేళ్ల ఇండస్ట్రీ చరిత్రలో ఒక సీఎం సభ కోసం షూటింగ్‌లు రద్దు చేయడం, సినీ కార్మికులను పనికి దూరంగా పెట్టడం జరగలేదని, ఇదొక అవాంఛనీయ పరిణామమని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయం వెంటాడుతున్నది. హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
సబ్బండ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే అభినందన సభ పేరుతో మరోమారు అమలుకానీ హామీలను గుప్పించి కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇండస్ట్రీ అంతర్గత సమాచారం ప్రకారం సీఎం వ్యవహార శైలిపై కార్మికులందరూ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై తమ ప్రయోజనాలను పణంగా పెట్టారని కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది. అనిల్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిస్తుండటాన్ని కార్మికులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం సన్మాన సభ కోసం యావత్ ఇండస్ట్రీకి సెలవు ప్రకటించడం ఇప్పటివరకు జరగలేదని, సీఎం రేవంత్ ఒత్తిడికి తలొగ్గి ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.
ఆగస్ట్ నెలలో జరిగిన సమ్మె వల్ల దాదాపు 30వేలకు పైగా సినీ కార్మికులు ఉపాధి కరువై ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న తరుణంలో ఫెడరేషన్ ఏకపక్షంగా షూటింగ్‌లకు సెలవు ప్రకటించడాన్ని కార్మికులు తప్పుపడుతున్నారు. ఒక్కరోజు షూటింగ్‌లు రద్దు చేయడం వల్ల కార్మికులతో పాటు నిర్మాతలు, నటీనటులు కూడా తీవ్రంగా నష్టపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో అగ్ర హీరోల చిత్రాలతో పాటు పదుల సంఖ్యలో షూటింగ్స్ జరుగుతున్నాయి.
ఫెడరేషన్ అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్టిస్టులు డేట్స్ సర్దుబాటుతో పాటు ముందస్తు షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయని, దానివల్ల ఒక్కరోజులో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మక్కులు చేసినా నమ్మే పరిస్థితులు లేవని, గత రెండేళ్లుగా సినీ పరిశ్రమ అస్తవ్యస్తం అయిన విషయాన్ని పరిశీలిస్తున్న సినీ కార్మికులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు రూపంలో తమ నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ
జరుగుతున్నది.
జూబ్లీహిల్స్, అక్టోబర్ 28 : సినీ కార్మికుల అభినందన సభలో కృష్ణానగర్ ఓటర్లను టార్గెట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ వరద ముంపు సమస్యపై ప్రస్తావించకపోవడంపై స్థానికులు పెదవి విరిచారు. సినీ పరిశ్రమలో స్థిరపడిన పలు వర్గాలు యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్, ఎల్ఎన్నగర్ కేంద్రంగా ఉంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వరద ముంపు సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో భారీ వ్యయంతో బాక్స్ టైప్ డ్రైన్ నిర్మాణం చేపట్టారు.
ఈ బాక్స్ డ్రైన్ పోలీస్ బెటాలియన్ నుంచి రావాల్సి ఉండడంతో అప్పట్లో అనుమతులు తీసుకుని స్థానిక కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం మీదుగా నిర్మాణాన్ని తుది దశకు తీసుకొచ్చారు. ఇంతలో గోపీనాథ్ అకాల మరణంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రధాన రహదారి అనుమతుల ఊసే ఎత్తకుండా వర్షాలు వచ్చినప్పుడల్లా కృష్ణానగర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మీడియా ముందు మంత్రులు హామీలివ్వడం తప్ప చేసిందేమీ లేదు.
తాజాగా సోమవారం సీఎం కూడా రాక రాక వచ్చారు. కృష్ణానగర్‌లో ఉంటున్న సీని కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యను పరిష్కరిస్తామని కానీ.. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటికే సగం నిర్మాణమై ఉన్న బాక్స్‌టైప్ డ్రైన్‌కు అనుమతులు పొందేలా చూస్తామని కానీ ఒక్కమాట కూడా చెప్పకపోవడంపై స్థానికులు నిరాశ చెందారు. కృష్ణానగర్ ముంపు సమస్యను పరిష్కరించేవారికే మా ఓటేస్తామని స్థానికులు చెబుతున్నారు.