సిటీబ్యూరో/కంటోన్మెంట్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : తిరుమలగిరి మండలంలోని 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి సర్కార్ స్థలాన్ని కాపాడలంటూ..నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం పరిధిలోని 8వందల కోట్ల రూపాయల విలువ జేసే 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడి అక్కడే పేదల కోసం 6 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైందని తెలిపారు. గతంలో ఇదే భూమిలో కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తే అప్పటి తహసీల్దార్ వారిపై పోలీసు కేసు నమోదు చేయించారన్నారు. అది ప్రభుత్వ భూమి అని ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. ఇదే భూమిలో ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని కాంగ్రెస్ నేతలే ప్రతిపాదించారని అన్నారు. ఈభూమిలో షాపింగ్ మాల్ కాకుండా పేదలకు గృహాల నిర్మాణానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ఓ ఎమ్మెల్యేకు ఈ భూమి వ్యవహారంలో 5కోట్లు అందాయనే ఆరోపణలు వెలుగులోకి రావడం సిగ్గుచేటని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూమిని కబ్జాదారులకు అప్పగించడం దారుణమన్నారు. ఈ భూ వ్యవహారంపై కలెక్టర్ సమగ్ర విచారణ చేసి భూమి రక్షణకు అవసరమైన కౌంటర్ కోర్టులో దాఖలు చేయాలని చెప్పారు. అనంతరం బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్ మాట్లాడుతూ పేదలకు చెందాల్సిన భూములను భూ మాఫియా చేతుల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లనియ్యడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
నివేదిత సాయన్న మాట్లాడుతూ ప్రభుత్వ స్థలం కబ్జా అవుతున్నా స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ పట్టించుకోవడం లేదని భూకబ్జా వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్సీ, మాజీ సీఈవో పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారన్నారు. కాగా, తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ హరికకు కౌంటర్ ధాఖలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. జూలై 13 వరకు కౌంటర్ దాఖలు చేస్తామని డిప్యూటీ తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, పాండుయాదవ్, శ్యామ్‌కుమార్, లోక్‌నాథ్. మీనా భాస్కర్, శేఖర్, కిరణ్‌కుమార్, రాజు, కనకయ్య, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.