సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ చేసిన కుట్రలకు చెక్ పడింది. ఉదయం నుంచి ఆమె నామినేషన్లను తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసింది. నామినేషన్ల పరిశీలన మొదలు కాకుండానే, నామినేషన్ పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని ఎన్నికల సంఘం అధికారులు గుర్తించినట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. కానీ అప్పటికీ సునీత నామినేషన్ల పత్రాల పరిశీలన కూడా జరగలేదని తెలిసింది.
అయితే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని నిలువరించేలా, అభ్యర్థి సునీత వ్యక్తిగత అంశాలను బహిర్గతం చేస్తూ, లేని పోని అబద్ధాలను వ్యాప్తి చేసింది. తీరా పరిశీలన తర్వాత ఆమె వేసిన నామినేషన్లను ఆమోదించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించడంతో కాంగ్రెస్ అబద్ధాలకు తెరపడింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సునీత మాట్లాడుతూ… అవాస్తవాలను చర్చించాల్సిన అవసరమే లేదని, వ్యక్తిగత అంశాలతో నామినేషన్లకు సంబంధం లేదన్నారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారంతో కాంగ్రెస్ పార్టీ రాక్షాసనందం పొందుతుందని, దీంతో నామినేషన్ల ఆమోదంతో వారి సంబురాలకు తెరపడిందన్నారు. ఇక ప్రద్యుమ్న అంశం ఇప్పుడు అప్రస్తుతమని, దానిపై మాట్లాడాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు.
తన నామినేషన్ పత్రాల్లోని అఫిడవిట్ అవాస్తవమంటూ విస్తృత ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు షాకిచ్చినట్లుగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత వ్యవహారించారు. నవీన్ వేసిన నామినేషన్ పత్రాల్లోని ఫారం 26ని ఖాళీగా ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తప్పిదమని వాదించారు. దీంతో ఒకనొక సమయంలో సాయంత్రం వరకు విషప్రచారంలో మునిగిపోయిన నవీన్ యాదవ్‌లో ఆందోళన కలిగినట్లుగా సమాచారం. కానీ చివరకు సాంకేతిక కారణాల దృష్ట్యా తిరస్కరించే అంశాలే కాదని అధికారులు తేల్చడంతో ఇరువురి ప్రత్యర్థుల నామినేషన్లకు ఆమోదం పడింది.