“నగరంలో మెట్రో విస్తరణ పేరిట కాంగ్రెస్ సర్కారు గాల్లో మేడలు కడుతోంది. ఓవైపు జనసంచారమే లేని ఊహానగరిలో మెట్రోను పరుగులు పెట్టిస్తామంటూ ఉత్సాహం చూపుతుంటే.. మరోవైపు కేంద్రం అనుమతులు లేకుండానే జాయింట్ వెంచర్ అని చెప్పుకోవడంతోపాటు నేరుగా జీవోనే జారీ చేసింది. పోనీ అటు కేంద్రంలో గానీ, ఇటు రాష్ట్ర తాజా బడ్జెట్లోనైనా కేటాయింపులున్నాయంటే అదీ శూన్యమే. ఇలా కాగితాలపై మెట్రో ప్రతిపాదనలతో నగరవాసులను ఊరిస్తోంది. వేల కోట్ల ప్రాజెక్టులను నిర్మిస్తున్నామంటూ చెబుతున్నారే తప్పా..కనీసం ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది”.
సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ) : నగరంలో మెట్రో ఫేజ్-2 విస్తరిస్తున్నామని కాంగ్రెస్ చెప్పుకున్న మాటలు సత్యదూరంగానే ఉన్నాయి. ఆచరణకు సాధ్యం కానీ ఆశయాలతో హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతున్నామంటూ గొప్పలకు పోతున్నారని చెప్పడానికి ప్రభుత్వ విధానాలే నిదర్శనంలా నిలుస్తున్నాయి. మెట్రో విస్తరణకు ఏడాది కాలంగా ప్రకటనలతో నెట్టుకొస్తున్న రాష్ట్ర సర్కారు… కనీసం మెట్రో ఫేజ్-2 పార్ట్ ఏకు రూపొందించిన డీపీఆర్ ఆమోదానికి కేంద్రాన్ని ఒత్తిడి చేయలేకపోతుంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సంపన్నుల కోసమే మెట్రో అవసరం లేదని, ఓల్డ్ సిటీ వాసులు మెట్రో ప్రయాణించాలంటూ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఓల్డ్ సిటీ మెట్రోకు ఇప్పటికీ భూసేకరణను పూర్తి చేయలేకపోయారు. ఇక నగరంలో రూ. 44వేల కోట్ల అంచనా వ్యయంతో 162.5 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరిస్తున్నామని చెప్పుకుంటున్న సర్కారుకు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించనే లేదు.
ఊహానగరికి మెట్రో..
తొలి దశలో నిర్మించిన మెట్రో మార్గాల్లో నాగోల్-రాయదుర్గ్(29కి.మీ) లైన్ అత్యంత కీలకమైనది. ఈ మార్గంలో అత్యంత రద్దీ ఉంటుంది. ఈ మార్గాన్ని ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తూ బీఆర్ఎస్ సర్కారు శంకుస్థాపన చేసి, భూసేకరణతోపాటు, టెండర్లు కూడా ఖరారు చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ ప్రాజెక్టును రద్దు చేసి జనసంచారమే లేని ఊహానగరి(ఫ్యూచర్ సిటీ)కి 40కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని నిర్మించాలని భావిస్తోంది. ఓవైపు పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వే తామే నిర్మించామని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు… పట్టాలెక్కిన ఎయిర్‌పోర్టును మెట్రోను కాలరాసింది. ఇలా జనాల అవసరాలను మరిచి… ఇప్పటికిప్పుడూ ఎలాంటి ప్రయోజనం లేని మెట్రో మార్గం వైపు అడుగులు వేస్తోంది.
నిధుల కేటాయింపులేవి…?
దాదాపు రూ. 44వేల కోట్ల అంచనా వ్యయంతో నగరంలో 162.5 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరిస్తున్నట్లుగా చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, హైదరాబాద్ మెట్రో సంస్థకు ఇప్పటికీ రెండో దశ విస్తరణ కోసం చిల్లిగవ్వ కేటాయించలేదు. ఇటీవల రూ. 2వేల కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న ఓల్డ్ సిటీ మెట్రో కోసం విడుదల చేసిన రూ. 125 కోట్లతో భూసేకరణ కూడా పూర్తి కాలేదు. ఇక రెండో దశలో రెండు భాగాలుగా విడదీసి రూపొందించిన ప్రణాళికలకు కనీసం బడ్జెట్లో నిధుల కేటాయింపులే జరగనేలేదు. కనీసం ఈ బడ్జెట్లో పురపాలక శాఖ చేపట్టిన మొత్తం ప్రాజెక్టులకు రూ. 18వేల కోట్లు ఉంటే… రూ. 44వేల కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న మెట్రోకు ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్ర బడ్జెట్లోనైనా తెలంగాణ చేపట్టిన మెట్రో ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తుందంటే ఇప్పటికీ అతిగతి లేదు.
కేంద్ర ఆమోదించకుండానే ..
మెట్రో విస్తరణ కోసం రాష్ట్ర సర్కారు గతేడాది నవంబర్ మొదటి వారంలో, జూన్ 16న పార్ట్ బీకి పాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. రెండు భాగాలుగా నిర్మించే ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేదు. కానీ ఈ ప్రాజెక్టును 18శాతం కేంద్ర నిధులతో జాయింట్ వెంచర్‌గా డెవలప్ చేస్తున్నట్లుగా జీవో జారీ చేయడం ఇప్పుడు విడ్డూరంగా ఉంది.
కేవలం మెట్రో సంస్థ రూపొందించిన ప్రతిపాదనలు మాత్రమే కేంద్రానికి చేరాయని, ఇప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మోదీ సర్కారు చెప్పుకోవడం ఇందులో కొసమెరుపు. ఇలా కేంద్రం సమ్మతి లేకుండానే జాయింట్ వెంచర్‌గా చెప్పుకుంటున్న సర్కారు కనీసం ఆరునెలలు గడిచిన రెండో దశలో పెట్టిన పార్ట్ ఏ భాగానికి అనుమతులు తీసుకురాలేకపోయింది. కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేస్తున్నామని చెబుతున్నారే తప్పా ఇప్పటికీ ఎలాంటి సమ్మతి లేదని స్పష్టం అవుతుంది.
స్పష్టత లేని నిధుల సర్దుబాటు…
మొత్తం ప్రాజెక్టు కోసం రాష్ట్ర సర్కారు 30శాతం, కేంద్ర వాటాగా 18శాతం, లోన్ల రూపంలో 48శాతం, మిగిలిన 4శాతం నిధులను పీపీపీ విధానంలో సర్దుబాటు చేస్తామని డీపీఆర్‌లో పేర్కొన్న మెట్రో సంస్థకు ఇప్పటికీ కేంద్ర వాటాపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పటికీ డీపీఆర్‌పై టెక్నికల్ అంశాలు దాటి చర్చ కూడా జరగలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో నిధుల సర్దుబాటు ఎలా చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖర్చు చేయాల్సిన 30శాతం నిధులు అంటే రెండు భాగాలకు కలిపి రూ. 14వేల కోట్లకు ఇప్పటికీ వరకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపుల్లేవు. రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు మొత్తం రూ. 18వేలు కేటాయించిన సర్కారు.. ఇందులో మెట్రో కోసం ఇప్పటివరకు నయా పైసా ఖర్చు చేసింది లేదు. 18శాతం నిధులపై కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
ఇక మిగిలిన 48శాతం నిధులను కేంద్రం గ్యారెంటీగా ఉంటే తప్పా… అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులు మంజూరు చేయలేవు. ఇదంతా పూర్తి చేసి టెండర్లు ఆహ్వానిస్తే గానీ 4శాతం నిధులు పీపీపీ విధానంలో జమ కానీ పరిస్థితి. ఆసియాలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుగా చేపట్టిన మెట్రో తొలి దశ దెబ్బతో… ఇప్పటికిప్పుడు కనీసం రూ. 1700 కోట్లు పెట్టే కంపెనీలు కూడా ఆసక్తి చూపే అవకాశం లేదు. మొదటి దశ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థనే… పీపీపీ విధానంలో ఓల్డ్ సిటీ మెట్రోను నిర్మించేందుకు ముందుకు రాలేదంటే… కేంద్ర, రాష్ట్ర నిధులపై ఎలాంటి స్పష్టమైన హామీ లేకుండా ఏ నిర్మాణ సంస్థ ముందుకు వస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
కేంద్రానికి చేరని పార్ట్-బీ…
ఇక సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్న పార్ట్-బీలోని ఊహానగరి మెట్రో, నార్త్ సిటీ మెట్రో నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ కేంద్రానికి చేరనే లేదు. పాలనపరమైన అనుమతులు ఇచ్చామని హడావుడి చేస్తున్నా… మరో వారం తర్వాతే కేంద్రానికి పార్ట్ – బీ డీపీఆర్ చేరనుంది. ఈ విధంగా నగరంలో మెట్రో విస్తరణ పేరిట కాంగ్రెస్ సర్కారు మెట్రో సంస్థతో కలిసి గాలిలో మెట్రో మేడలు కడుతూ.. నగర వాసులను ఊహాల పల్లకిలో ఊరేగిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.