సిటీ బ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ సరళి, బూత్‌లలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించేందుకు వెళ్లిన సునీతను ఎక్కడికక్కడ అవమానాలకు గురిచేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా డబ్బుల పంపిణీకి పాల్పడుతుండటంతో ప్రశ్నించిన సునీతను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
కాంగ్రెస్ అరాచకాలను నిలదీయడానికి బూత్‌ల వద్దకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. అన్ని బూత్‌లలో పర్యటించేందుకు అభ్యర్థికి అనుమతి ఉన్నా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ అడ్డంకులు సృష్టించారు. పోలీసుల తీరు, కాంగ్రెస్ అరాచకాలను నిరసిస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు భయపడి ఓటర్లు బయటకు వచ్చేందుకు జంకుతున్నారని ఆరోపించారు.
సునీత, ఆమె కూతుళ్లపై బూతుపురాణం..
యూసుఫ్‌గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ భారీగా మహిళలను ఉంచారు. సమాచారం తెలుసుకున్న మాగంటి సునీత, బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకుని వారిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేసేందుకు యత్నించారు. ఈక్రమంలో ప్రతిఘటించిన సునీత, ఆమె కూతుళ్లపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక నుంచి జూబ్లీహిల్స్‌లో ఎలా తిరుగుతారో చూస్తామని బెదిరించారు.