బడంగ్‌పేట, నవంబర్ 4 : కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కరంటు కోతలు తప్పవని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలప్పడు ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే ధరల భారం మోపి నడ్డి విరుస్తారని పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… బీఆర్ఎస్ను గెలిపిస్తే నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్, పేద ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తామన్నారు.
బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని, ఇది ప్రజలు గమనించాలని కోరారు. గతంలో లెనిన్ నగర్ వర్షాకాలంలో వరదలతో అల్లాడి పోయేదని, వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ప్రత్యేక ట్రంక్ లైన్లు ఏర్పాటు చేసి వరద నీరు ఇండ్లలోకి రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, నర్సింహ, మల్లేశ్ ముదిరాజ్, లావణ్య బీరప్ప, భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కామేశ్ రెడ్డి, భూపేశ్ గౌడ్, శ్రీను నాయక్, రవినాయక్, జంగయ్యగౌడ్, కృష్ణ, జోజి, రాము ఉన్నారు.