సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) ;గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఒక దఫా ముగించి… రెండో దశ కూడా చివరలో ఉంది. ఎన్నికల బరిలో పోటీ ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు ముందుగానే చేతులెత్తేస్తున్నాయి. దీటైన పోటీ దేవుడెరుగు… కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక విలవిలలాడుతున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితా ప్రకంపనలతో రెండో జాబితా ప్రకటించటం లేదు. బీజేపీలో పోటీకి అగ్రనాయకులే ముఖం చాటేస్తుండడంతో క్యాడర్లో అయోమయం నెలకొన్నది. గులాబీ జోరు చూసిన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కారెక్కేందుకు క్యూ కడుతున్నాయి.
ఎన్నికల నగారా మోగిందంటే ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల కోలాహలమే కనిపిస్తుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం విచిత్ర పరిస్థితి. ఏ నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా… గులాబీ జెండా,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు..నేతల సందడి తప్ప.. ప్రతిపక్ష పార్టీల హడావుడి కనిపించడం లేదు. ఇక… కాంగ్రెస్, బీజేపీలకు అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే దొరక్కపోవడంతో అధిష్ఠానాలు సైతం అభ్యర్థుల జాబితాపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. పోటీ ఏకపక్షం అని తేలుతుండడంతో చాలా మంది కీలక నేతలు, శ్రేణులు ఆయా పార్టీలను వదిలి గులాబీ కండువాలు కప్పుకుం టున్నారు. ఈ క్రమంలోనే నిత్యం అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది. యాభై రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించడంతో అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక దఫా ప్రచారాన్ని ముగించి… రెండో దశ ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల వైపు నుంచి కనీస కదలిక లేకపోవడం ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఐదారు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కరువయ్యారు. మొదటి జాబితాలో 14 స్థానాలు ప్రకటించినప్పటికీ ప్రధానమైనవి కొన్ని మాత్రమే ఉన్నాయి. దీంతో మేడ్చల్, ఉప్పల్, పాతబస్తీలోని బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఎగిసిపడిన అసంతృప్తి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సైతం ఖంగు తినిపించింది. దీంతో రెండో జాబితా విడుదల చేసేందుకే ఆ పార్టీ జంకుతున్న పరిస్థితి. మరోవైపు బీజేపీది ఇంకా దయనీయమైన స్థితి. ముషీరాబాద్, అంబర్‌పేట్‌లో ఎంపీలను దింపేందుకు ప్రయత్నిస్తున్నా… వాళ్లు ససేమిరా అనడంతో అక్కడ సైతం అభ్యర్థులు దొరకడంలేదని తెలిసింది. దీంతో చెప్పుకోదగిన, సిట్టింగ్ స్థానమైన గోషామహల్లో మళ్లీ రాజాసింగ్ మాత్రమే దిక్కవ్వడంతో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి, టికెట్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. రెండు పార్టీల పరిస్థితి ఇలా తయారవ్వడంతో బీఆర్ఎస్లోకి వలసలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
ఖాళీ అవుతున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేయకముందే మేడ్చల్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో పాటు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరడంతో అక్కడ పార్టీ దాదాపు ఖాళీ అయింది. మొదటి జాబితా వెలువడిన రోజే ఉప్పల్‌లో రాజీనామాల పర్వం కొనసాగింది. కీలకమైన నేత రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. దీనికి తోడు ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషతో పాటు ఆమె భర్త, కీలక నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ కార్యదర్శి జితేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ యాదగిరి, ఉప్పల్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎం. శ్రీను వంటి వారు కూడా పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వచ్చారు. వీరే కాదు… డివిజన్ స్థాయి నాయకులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీని వీడగా, వీరి వెంట వేలాదిగా కార్యకర్తలు హస్తం నుంచి గులాబీ పార్టీలోకి వచ్చారు. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లెలగూడ కార్పొరేటర్ గౌరీశంకర్ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గులాబీ కండువా కప్పుకున్నారు. ఎల్బీనగర్లో సీనియర్ కాంగ్రెస్ నేత మందా సత్యనారాయణరెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇలాఖాలోనే..
గ్రేటర్ పరిధిలో ఒకట్రెండు స్థానాల్లో బీజేపీ ఉనికి కాస్త కనిపిస్తున్నప్పటికీ వలసలతో అక్కడ కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడు పర్యాయాలు గెలిచిన అంబర్‌పేటలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ గ్రేటర్ పార్టీ మాజీ అధ్యక్షుడు, గద్వాల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వెంకట్‌రెడ్డి ఆయన భార్య, కార్పొరేటర్ పద్మా వెంకట్‌రెడ్డి సహా పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం సంచలనం సృష్టించింది. దీంతో పాటు జేపీ డివిజన్ ప్రెసిడెంట్ రమణానాయుడు, జీహెచ్ఎంసీ మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షుడు బషీరుద్దీన్ బీఆర్ఎస్లో చేరారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీలో ఉత్తరాది ప్రజల అసోసియేషన్లకు సంధాన కర్తగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రాజ్ పురోహిత్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఉప్పల్‌లో బీజేపీ హబ్సిగూడ డివిజన్ కార్యదర్శి పాండునాయక్, కందుకూరులో ఎంపీటీసీ రాజన్, బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్‌రెడ్డి పార్టీని వీడి కారెక్కారు. ఎల్బీనగర్లో బీజేపీ రాష్ట్ర స్లమ్ సెల్ కన్వీనర్ పసుపుల హరిబాబు, బీజేపీ ఎస్టీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పాశం శ్రీశైలం, బీజేపీ రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సీహెచ్ లక్ష్మి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ కమలానికి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.