Hyderabad | మన్సూరాబాద్, జనవరి 31: కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించి.. దాడికి పాల్పడిన ఓ యువతిపై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 25న ఉదయం హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్సు రూట్ నం. 72 హయత్‌నగర్ నుంచి అఫ్జల్‌గంజ్‌కు బయలుదేరింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఎన్టీఆర్నగర్ మార్కెట్ ఎదురుగా ఉన్న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఓ యువతి బస్సు ఎక్కింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో జీరో టికెట్ కొట్టేందుకు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా మరేదైన ఐడీ ఫ్రూఫ్ చూపాలని కండక్టర్ గంగాధర్ కోరాడు.
యువతి వద్ద ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోవడంతో టికెట్ తీసుకోవాలని కోరగా.. సదరు యువతి రూ.500 నోటు ఇచ్చింది. బస్సు మొదటి ట్రిప్పు కావడంతో టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని కోరాడు. చిల్లర ఇవ్వమని కోరిన కండక్టర్ అంతు చూస్తానంటూ తన సెల్ఫోన్లో అతడి చిత్రాన్ని తీసింది. అంతటితో ఆగకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ బస్సులో నానా హంగామా సృష్టించింది. తన పేరును ఎండీ సయ్యద్ అని చెప్పి బస్సులో వీరంగం సృష్టించింది. ప్రయాణికులు, ఇతర ఆర్టీసీ సిబ్బంది కలుగజేసుకోవడంతో ఎట్టకేలకు సదరు యువతి బస్సు దిగి వెళ్లి పోయింది. హయత్‌నగర్ డిపో-1 మేనేజర్ జలగం విజయ్ బుధవారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.