Krishna Water | చంద్రబాబు సర్కారు జల చౌర్యానికి..మేఘా కంపెనీని కాపాడాలనే రేవంత్ సర్కారు పన్నాగం… వెరసి నాగార్జునసాగర్‌కు పుష్కలమైన ఇన్‌ఫ్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అల్లాడుతుండగా… మరోవైపు మార్చి రెండో వారంలోనే ‘ఎమర్జెన్సీ’ ఘంటికలు మోగడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఎండా కాలం ఆరంభంలోనే ఇలాంటి సంక్షోభ పరిస్థితి నెలకొనడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో జలమండలి మార్చిలోనే ఎమర్జెన్సీ మోటార్ల ఏర్పాటును మొదలుపెట్టడం హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ముప్పు పొంచి ఉన్నదనేది స్పష్టమవుతున్నది. మేఘా కంపెనీ నిర్వాకంతో సుంకిశాల పథకం అందుబాటులోకి రాకపోవడంతోనే ఎమర్జన్సీ మోటార్లపై ఆధారపడాల్సి వస్తున్నది. రూ.4.68 కోట్లతో పుట్టంగండి వద్ద ఎమర్జెన్సీ మోటార్లను అమర్చే పనులకు గురువారం టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం ఖాళీ అవుతున్న తీరును పరిశీలిస్తే రానున్న ఒకట్రెండు నెలల్లో ఓ వైపు సాగునీరు… మరోవైపు హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం తాగునీటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 13 (నమస్తే తెలంగాణ)
గతేడాది భారీ వరదలు..
నాగార్జునసాగర్ జలాశయానికి గతేడాది భారీ వరదలు వచ్చాయి. నవంబర్ చివరి నాటి వరకు ఇన్‌ఫ్లోలు రావడంతో పాటు ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి 850 టీఎంసీల కృష్ణా జలాలు కలిశాయి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తెలుగు రాష్ర్టాల్లోని ఆయకట్టుతో పాటు హైదరాబాద్ తాగునీటికి సైతం ఢోకా ఉండేది కాదు. చివరకు తదుపరి సంవత్సరంలో వర్షాలు ఆలస్యమైనా సరే… సెప్టెంబర్ వరకు తాగునీటికి ఇబ్బంది లేదని చరిత్రనే చెబుతున్నది. కానీ పుష్కలమైన ఇన్‌ఫ్లోలు ఉన్నా తాగు, సాగునీటికి మార్చిలోనే ఇబ్బందులు మొదలవ్వడం అనేది సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి అని అధికారులే చెబుతున్నారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం సాగర్‌కు ఇన్‌ఫ్లోలు నిలిచిపోయిన తర్వాత కూడా భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించుకుపోయింది. కేవలం సాగర్ కుడి కాల్వ ద్వారా 200 టీఎంసీలను తరలించుకుపోయారంటే దాని వెనక ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.
బాబు జలదోపిడీకి రేవంత్ తందాన!
అసలు కుడి కాల్వ కింద రెండు సీజన్లలో కలిపినా 200 టీఎంసీల మేర సాగునీటి వినియోగించేంత ఆయకట్టు లేదు… నిల్వ సామర్థ్యం కూడా లేదు. చంద్రబాబు సర్కారు ఇష్టానుసారంగా కోటాకు మించి నీటిని తరలిస్తున్నా.. రేవంత్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడంపైనా అనేక అనుమానాలున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్మాణ సంస్థ మేఘా ఇన్ఫ్రా నిర్వాకంతో మునిగిన సుంకిశాల పంపుహౌస్‌లో ఎండా కాలంలోనే పనులు జరగాలంటే సాగర్ ఖాళీ కావాల్సిన అవసరమున్నది. రేవంత్ ప్రభు త్వం లక్షలాది మంది రైతులు, హైదరాబాద్ తాగునీటి ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబు జల చౌర్యానికి సహకరించిందనే ఆరోపణలున్నాయి. ఫలితంగా మార్చి రెండో వారంలోనే జలమండలి సాగర్‌లో ఎమర్జెన్సీ మోటార్ల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టాల్సి వచ్చింది.
రెండు నెలల ముందే గడ్డు పరిస్థితి…
సాగర్‌కు ఇన్‌ఫ్లోలు లేని సంవత్సరంలోనూ నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించడం వల్ల మే నెలాఖరు వరకు అంతకంటే నీటిమట్టం తగ్గితే జలమండలి అత్యవసర మోటార్లను ఏర్పాటు చేసుకుంటుంది. ఏప్రిల్ చివర్లోగానీ ఆ ప్రక్రియపై దృష్టిసారించదు. కానీ ఇప్పుడు మార్చి రెండో వారంలోనే టెండర్లు పిలవడంపై ఇంజినీర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నీటి గండం
సుంకిశాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల పథకాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి 80 శాతానికి పైగా పనులు పూర్తయినా సర్కారు పర్యవేక్షణలోపంతో వేగంగా పనులు జరగలేదు. ఈలోగా జలమండలి ఇంజినీర్ల ఘోర వైఫల్యంతో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఇష్టానుసారంగా వ్యవహరించి తప్పుడు అంచనాలతో సొరంగాన్ని తెరిచి పంపుహౌస్‌లోని రిటెయినింగ్వాల్, గేట్లను కుప్పకూల్చింది. దీంతో ఐదు నెలలుగా సుంకిశాల పనులు నిలిచిపోయాయి. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తయితే ఇలాంటి అత్యవసర సమయంలో కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అయ్యేది. సుంకిశాల నిర్వాకం మూలాన జలమండలి ఇప్పుడు రూ.4.68 కోట్లతో ఎమర్జెన్సీ మోటార్లను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నది.