GHMC | సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ) : మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘సర్వే’ జీహెచ్ఎంసీకి సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది. సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం తీవ్రంగా పడుతున్నది. ప్రభుత్వం గడిచిన ఆరు రోజులుగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్లు దాదాపు 19వేల మంది పాల్గొంటుండగా.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సర్వేలోనే వీరంతా కొనసాగుతారు.
వీరికి సర్వే బాధ్యతలు రావడంతో ఆస్తి పన్ను వసూళ్లలో వేగం మందగించింది. గడిచిన 14 రోజుల్లో ఆస్తిపన్ను రూపంలో దాదాపు రూ. 10కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఈ సమయానికి రూ. 30కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉంది. కానీ సర్వే కారణంగా వసూళ్లపై అధికారులు ఏం చేయలేని పరిస్థితి. వాస్తవంగా గత నెలలో రూ.56 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఉద్యోగుల జీతాల చెల్లింపులపై కాస్త ప్రభావం చూపింది.ఈ నెలలో మాత్రం ఆస్తిపన్ను వసూళ్లు అసలే లేకపోవడంతో ఉద్యోగుల జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో అన్న చర్చ జరుగుతున్నది.